iDreamPost
android-app
ios-app

పాలేరు కాదు ఖమ్మం నుంచి! తుమ్మల సీటు మార్పుకు కారణం?

  • Published Oct 17, 2023 | 2:38 PMUpdated Oct 17, 2023 | 2:38 PM
  • Published Oct 17, 2023 | 2:38 PMUpdated Oct 17, 2023 | 2:38 PM
పాలేరు కాదు ఖమ్మం నుంచి! తుమ్మల సీటు మార్పుకు కారణం?

తెలంగాణ రాజకీయాల్లో.. ఖమ్మంకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఖమ్మం తెలంగాణ రాజకీయాలకు గుమ్మం అంటారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో స్ట్రాంగ్‌ నియోజకవర్గాల్లో ఖమ్మం ముందు వరుసలో ఉంటుంది. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఖమ్మంలో తన హవా కొనసాగిస్తూ వస్తోంది. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల ముందు మాత్రం.. ఖమ్మంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది అని చెప్పవచ్చు. జిల్లాలో పార్టీకి కీలకంగా భావిస్తోన్న ఇద్దరు నేతలు.. బీఆర్‌ఎస్‌ పార్టీని వీడారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇద్దరు కారు దిగి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

దాంతో ఖమ్మం అసెంబ్లీలో తన హవా కొనసాగించాలని కాంగ్రెస్‌ పార్టీ బలంగా నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో.. తుమ్మలను ఖమ్మం బరిలో నిలపాలని కాంగ్రెస్‌ వ్యూహం రచిస్తోంది. దీనిపై ఇప్పటికే ఢిల్లీలోని హైకమండ్‌ పెద్దలతో కాంగ్రెస్‌ నేతలు చర్చలు జరిపారు. ఖమ్మం నియోజకవర్గంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నేత పువ్వాడ అజయ్‌  స్ట్రాంగ్‌ లీడర్‌గా ఎదిగారు. గత రెండు ఎన్నికల్లో ఆయన విజయం సాధించి.. ఈసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పువ్వాడను ఎదుర్కొనేందుకు.. తుమ్మలను ఖమ్మం బరిలో నిలపాలని కాంగ్రెస్‌ అధిష్టానం, రాహుల్‌ గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తుమ్మల గత ఎన్నికల్లో పాలేరు నుంచి అప్పటి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా నియోజకవర్గంతో మంచి సంబంధాలనే కొనసాగించారు. కాంగ్రెస్‌లోకి మారిన తర్వాత పాలేరు నుంచే పోటీ చేయాలని ఆశించారు. హామీ కూడా పొందారు. అయితే ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఇక తుమ్మల కూడా అదే సామాజిక వర్గం కావడంతో.. కుల ప్రతిపాదికన ఈ అంశం కలసి వస్తుందని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. ఇక తుమ్మల పోటీ చేయాలని ఆశించిన పాలేరులో రెడ్ల ప్రభావం ఎక్కువగా ఉన్నందున అక్కడ పొంగులేటి పోటీ చేస్తే పార్టీకి కలసి వస్తుందని కాంగ్రెస్‌ భావించింది.

సర్వే ఫలితాలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించడంతో.. కాంగ్రెస్‌ హైకమాండ్‌, రాహుల్‌ గాంధీ కూడా తుమ్మలను ఖమ్మం నుంచి పోటీ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం తుమ్మల, పొంగులేటిని ఢిల్లీ పిలిపించి.. వారితో చర్చించి.. అంగీకరింపచేశారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదే జరిగితే.. ఖమ్మంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య రసవత్తర పోరు సాగుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి