iDreamPost
android-app
ios-app

పాపం రేవంత్‌.. కాంగ్రెస్‌ గెలిచినా సీఎం కాలేరా?

  • Published Oct 18, 2023 | 2:57 PMUpdated Oct 18, 2023 | 2:57 PM
  • Published Oct 18, 2023 | 2:57 PMUpdated Oct 18, 2023 | 2:57 PM
పాపం రేవంత్‌.. కాంగ్రెస్‌ గెలిచినా సీఎం కాలేరా?

తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. డిసెంబర్‌ 3న పార్టీల భవితవ్యం బయట పడనుంది. ఏ పార్టీ గెలుస్తుంది.. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో డిసెంబర్‌ 3న తెలియనుంది. ప్రస్తుతం అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి.. తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలను కోరుతుంది. అంతేకాక తాము అధికారంలోకి వస్తే.. ప్రజలకు ఎలా మేలు చేస్తామో వివరిస్తూ.. మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలు, హామీలను చేర్చింది. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చూస్తే.. మరోసారి విజయం సాధించి.. ఆ పార్టీ హ్యాట్రిక్‌ కొడుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఎన్నికల కదన రంగంలో బీఆర్‌ఎస్‌ విపక్షాల కన్నా పదడుగులు ముందే ఉంది. అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదలతో పాటు.. ప్రచారం కూడా ప్రారంభించింది.

ఇక విపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీలు కూడా ఎన్నికల రంగంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఓటర్లను ఆకర్షించేందుకు 6 గ్యారెంటీలను ప్రకటించింది. ఇక రేవంత్‌ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తోంది. నిత్యం ప్రజల్లో ఉండేలా రేవంత్‌ రెడ్డి ప్రణాళికలు రచించుకుని ముందుకు వెళ్తున్నారు.

అయితే కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న క్రమశిక్షణారాహిత్యం ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా మారిందని.. ఆ విషయాన్ని హైకమాండ్‌ సహా ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ తలనొప్పులు తట్టుకోలేకనే.. రాహుల్‌ గాంధీ అధ్యక్ష బాధ్యతలు కూడా స్వీకరించలేదనే టాక్‌ ఉంది. ఇక తాజాగా ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసి జనాలు సైతం ఇదే మాట అంటున్నారు. ఇప్పుడే ఇలా ఉన్నారు.. ఇక వీరికి అధికారం కట్టబెడితే.. ఆ తర్వాత పరిస్థితి ఏంటి అని చర్చించుకుంటున్నారట.

సీఎం క్యాండెట్‌పై చర్చ..

ఎన్నికల నగరా మోగింది. ఇంకా కాంగ్రెస్‌ పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్ధులను ప్రకటించలేదు. అప్పుడే సీఎం క్యాండెట్‌ గురించి చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. నేనే సీఎం అంటూ సీనియర్లు డప్పు కొట్టుకుంటున్నారు. ఇక తాజాగా ఈ జాబితాలోకి సీనియర్‌ నేత జానారెడ్డి కూడా చేరారు. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. తాను కూడా సీఎం అవ్వొచ్చు అంటూ  జానా రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు.. ఓటింగ్ జరగలేదు.. కానీ అప్పుడే కాంగ్రెస్‌ పార్టీ గెలిచినట్లు.. ఊహించుకుని సీఎం క్యాండెట్‌ నేనంటే నేనని కొట్టుకుంటున్నారు.. ఇదెక్కడి విడ్డూరం అని జనాలు విస్తుపోతున్నారు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు అదేదో అన్నట్లుగా ఉంది కాంగ్రెస్‌ నేతల తీరు అంటూ జనాలు ఎద్దేవా చేస్తున్నారు.

రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌..

సీఎం కావాలనే ఆశతో ఉన్న రేవంత్‌ రెడ్డికి ఇది భారీ షాక్‌ అనే చెప్పవచ్చు. సీనియర్లు అందరూ నేనే సీఎం క్యాండెట్‌ అని ప్రకటించుకోవడం చూస్తుంటూ.. ఒకవేళ.. అదృష్టం బాగుండి.. కాంగ్రెస్‌ పార్టీ గెలిచినా.. రేవంత్‌ రెడ్డి సీఎం కాలేడనే టాక్‌ వినిపిస్తోంది. పైగా ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి డబ్బులకు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నాడని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఇక కొందరు సీనియర్లకు అసలు రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడమే నచ్చలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని.. నిజంగా కాంగ్రెస్‌ గెలిచినా.. రేవంత్‌ సీఎం కావడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డిని సీఎంగా ఒప్పుకునే అవకాశలు చాలా తక్కువనే చెప్పాలి. పైగా దళిత కార్డు అంశం తెర మీదకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు రాజకీయ పండితులు.

కాంగ్రెస్‌ పార్టీలో పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకునే.. సీఎం క్యాండెట్‌ గురించి గతంలో రేవంత్‌ రెడ్డి సీతక్కే మా సీఎం అని ప్రకటించాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. అలాంటి పక్షంలో ఇతర నేతలకు సీఎం పదవి వెళ్లకుండా సీతక్క పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించే అవకాశాలున్నాయని.. మహిళా సెంటిమెంట్‌ అంశం కూడా కలసి వస్తుంది కనుకే రేవంత్‌ ముందు జాగ్రత్తగా ఇలా ప్రకటించాడని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా కాంగ్రెస్‌ గెలిచినా.. రేవంత్‌ సీఎం కాలేడంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు విమర్శకులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి