Idream media
Idream media
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకుని జోరుమీద ఉన్న టీఆర్‌ఎస్ వరుస ఎన్నికలకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో జరగబోయే నాగార్జున సాగర్ శాసన సభ ఉప ఎన్నికకు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసిన గులాబీదళపతి కేసీఆర్.. నేతలకు బాధ్యతలు అప్పగించారు. నాగార్జున సాగర్‌లోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీలను 9 యూనిట్లుగా విభజించింది.. యూనిట్ల వారీగా మంత్రులకు బాధ్యలు అప్పగించారు. దుబ్బాక ఉప ఎన్నిక అనుభవంతో.. కేసీఆర్ సాగర్‌లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉండకూడదనే సంకేతాలను టీఆర్‌ఎస్ శ్రేణులకు ఇస్తున్నారు. అందుకే నాలుగు రోజుల పాటు ఎన్నికలపై సమీక్ష నిర్వహించి వ్యూహాలు సిద్ధం చేశారు.
సాగర్ ఉప ఎన్నికతోపాటు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపొందడంతో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు గులాబీ ప్రభుత్వం సిద్దమవుతోంది. మళ్లీ ఆ రెండు కార్పొరేషన్లలో జెండా ఎగురవేయాలని టీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్ శ్రేణులకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. యువత, పట్టభద్రులు తమ వైపే ఉన్నారని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో నిర్థారణ చేసుకున్న టీఆర్‌ఎస్.. సాగర్ ఉప ఎన్నిక తర్వాత ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే ప్లాన్‌తో ఉంది.
ఈ సారి కూడా ఖమ్మం, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ వ్యూహాలకు పదునుపెడుతోంది. 2016 మార్చి 6వ తేదీన రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 50 డివిజన్లు ఉన్న ఖమ్మంలో టీఆర్‌ఎస్ 34 డివిజన్ల గెలుచుకుని మేయర్ పీఠం కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఏడుగురు కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో చేరడడంతో ఆ పార్టీ బలం 41కి చేరుకుంది. కాంగ్రెస్‌కు ముగ్గురు, వామపక్ష పార్టీలకు ఐదుగురు, టీడీపీ తరఫున ఒకరు కార్పొరేషన్‌లో ప్రాతినిథ్యం వహించారు.
వరంగల్Sలోనూ గులాబీదళం ఘన విజయం సాధించింది. 58 డివిజన్ల ఉన్న గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 49 డివిజన్లలో గెలిచింది. కాంగ్రెస్ నాలుగు, బీజేపీ ఒకటి, సీపీఎం ఒకటి, స్వతంత్రులు మరో మూడు డివిజన్లలో గెలుపొందారు. ఫలితాల తర్వాత కాంగ్రెస్ కార్పొరేటర్ ఒకరు, సీపీఎం కార్పొరేటర్, స్వతంత్రులు ముగ్గురు టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 54కు చేరింది.
ఇప్పటికే రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. పాలక వర్గం గడువు ముగియడంతో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం భావించింది. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, ఆ వెంటనే జీహెచ్‌ఎంసీలో అనుకున్న స్థాయిలో డివిజన్లు గెలుచుకోలేకపోవడం వంటి కారణాలతో.. ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలవడంతో నగరపాలక ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ఆసక్తిగా ఉన్నారు. వేసవిలో నగరపోరు జరగడం దాదాపు ఖాయమైనట్లే.