iDreamPost
android-app
ios-app

పెద్దోళ్లు లేని ప్రచారం

  • Published Apr 25, 2021 | 12:23 PM Updated Updated Apr 25, 2021 | 12:23 PM
పెద్దోళ్లు లేని ప్రచారం

టీఆర్ఎస్ కు కర్త కర్మ క్రియ.. కేసీఆర్. కరోనా సోకడంతో ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఇక గులాబీ పార్టీలో నంబర్ 2 అయిన మంత్రి కేటీఆర్ కూడా వైరస్ బారిన పడి ఐసోలేషన్ లో ఉన్నారు. మరికొందరు లీడర్లకూ పాజిటివ్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మినీ మున్సిపోల్స్ ప్రచారం గందరగోళంగా తయారైంది. ముందుండి నడిపించే నాయకుడు లేక టీఆర్ఎస్ లీడర్, క్యాడర్ అంతా నిస్తేజం గా ఉంది.

క్యాడర్ రావడం లేదు..

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. సాగర్ ఉప ఎన్నిక తర్వాతే సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎంపీ సంతోష్.. ఇంకా చాలా మంది టీఆర్ఎస్ లీడర్లు వైరస్ బారిన పడ్డారు. దీంతో ప్రచారానికి వెళ్లేందుకు నేతలు భయపడుతున్నారు. క్యాడర్ కూడా రావడం లేదు. పెద్దపెద్ద లీడర్లకు కరోనా సోకిందని, తాము ప్రచారానికి వస్తే తమ పరిస్థితి కూడా అంతేనని అంటున్నారు. మరోవైపు ఓటు అడిగేందుకు రావొద్దని ప్రజలు అంటున్నారు. ఇళ్ల ముందు బోర్డులు కూడా పెడుతున్నారు. దీంతో ప్రచారంలో జోష్ కనిపించడం లేదు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నప్పుడు ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని సొంత పార్టీ లీడర్ల నుంచే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఫోన్లలోనే సూచనలు

ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న కేసీఆర్, కేటీఆర్.. లీడర్లతో ఫోన్ లో టచ్ లో ఉంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో తరచూ మాట్లాడుతున్నారు. ప్రచారంపై సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈనెల 30న ఎన్నికలు జరుగుతున్న ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీల్లో కచ్చితంగా గెలవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని నిఘా వర్గాల ద్వారా తెలుసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలకు గైడెన్స్ ఇస్తున్నట్లు తెలిసింది.

ఆసక్తి చూపని మంత్రులు

కరోనా కేసులు పెరిగిపోవడంతో ఇంటింటి ప్రచారానికి వెళ్లేందుకు మంత్రులు ఆసక్తి చూపడం లేదు. తమకు కేటాయించిన మున్సిపాలిటీలకు వెళ్లడం లేదు. కొందరు వెళ్తున్నా.. పెద్దగా ప్రచారం చేయడం లేదు. అయితే ఈ విషయం కేసీఆర్ దాకా వెళ్లినట్లు సమాచారం. దీంతో వారికి ఫోన్ చేసి.. సదరు మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ లో ఓడిపోతే చర్యలు తప్పవని తేల్చిచెప్పినట్లు తెలిసింది. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపైనే నిఘా పెట్టినట్లు చెబుతున్నారు.

సిద్దిపేటలో హరీశ్ కు సూచనలు

సిద్దిపేట.. టీఆర్ఎస్ కు కంచుకోట లాంటిది. గతంలో కేసీఆర్, కొన్నేళ్లుగా హరీశ్ రావు అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అక్కడ టీఆర్ఎస్ గెలుపు ఖాయమనే భావనలో లీడర్లు ఉన్నారు. అయితే పక్కనే ఉన్న దుబ్బాకలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది. దీంతో టీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావుకు కూడా కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. సిద్దిపేటలో ఎన్నికల ప్రచారాన్ని అడిగి తెలుసుకున్నట్టు సమచారం. హరీశ్ కు కేసీఆర్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారని చెబుతున్నారు.

Also Read : ఎన్నికలను ఆపండి ప్లీజ్‌..!