నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆరంభించిన పోరాటం దేశాన్ని కుదిపేస్తోంది. కార్పోరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ విజయవంతం అవ్వడంలో రాజకీయ పార్టీలు కీలకపాత్ర పోషించాయి. ఎన్డీయేతర పార్టీలన్నీ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించాయి. ప్రత్యక్షంగా భారత్ బంద్ లో పాల్గొంటున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ సైతం భారత్ బంద్ కు మద్దతు ప్రకటించింది. రాష్ట్ర మంత్రులంతా బంద్ లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహాన్ని ప్రకటించారు.
రైతుల ఉద్యమానికి అనూహ్యమైన మద్దతు లభించింది. పలు రాష్ట్రాల్లో అధికార పార్టీలు సైతం బంద్ లో భాగస్వామ్యమవ్వడం గమనార్హం. కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యక్షంగా బంద్ లో పాల్గొంటోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం భారత్ బంద్ కి మద్దతు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంద్ కు మద్దతు ప్రకటించడంతో టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ లో భాగస్వామ్యమయ్యాయి. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ సహా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బంద్ సందర్భంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో నిరంతరం రోడ్లమీద కనిపించిన పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఉద్యమాల వైపు మళ్లి చూడలేదు. ఒక దశలో ధర్నా చౌక్ కూడా అవసరం లేదని భావించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ…. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా మళ్లీ రోడెక్కడానికి సిద్ధమైంది. ఆరేళ్ల తరువాత టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొంటూ కనిపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఈటెల రాజేందర్ ఇలా టీఆర్ఎస్ నేతలంతా నిత్యం ప్రజలమధ్యే ఉండేవాళ్లు. ప్రతి రోజూ ఏదో ఒక ఆందోళనలో భాగమయ్యేవారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేవారు. మళ్లీ ఇన్నా్ళ్లకు టీఆర్ఎస్ తన పాత పంథాలోకి అడుగుపెట్టింది.
రాష్ట్రంలో దూకుడు పెంచిన బీజేపీకి కేంద్రంలో చెక్ పెట్టడానికి వ్యూహరచన చేస్తున్న కేసీఆర్ రైతు ఉద్యమంతో రంగంలోకి దిగారు. దేశ వ్యాప్తంగా ఎన్డీయే, యూపీయేతర పార్టీలను ఐక్యం చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ మళ్లీ వీథిపోరాటాలకు సిద్ధమవుతోంది. ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ విధానాలన్నిటిపైనా తీవ్రంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడుతూనే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ లాంటి అంశాలపై దృష్టిసారించే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ ఎత్తుకున్న ఈ కొత్త పంథా ఎలాంటి ఫలితాలను ఇస్తుందో మరి.