iDreamPost
iDreamPost
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు విదేశీ సినిమాలన్నా, పాత తెలుగు క్లాసిక్స్ అన్నా ఎంత మక్కువో అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. కాకపోతే వాటిని స్ఫూర్తిగా తీసుకున్నా లేదా యథావిధిగా వాడుకున్నా ద్దాన్ని పైకి చెప్పరు అంతే. సోషల్ మీడియా లేదా ఆన్ లైన్ ద్వారా ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే. నితిన్ ‘అఆ’ని దశాబ్దాల క్రితం వచ్చిన కృష్ణ-విజయనిర్మల నటించిన ‘మీనా’ నుంచి అడాప్ట్ చేసిన విషయాన్ని చాలా ఆలస్యంగా ఒప్పుకున్నారు. ఆ నవల రచయిత్రి యద్దనపూడి గారికి లేట్ గా క్రెడిట్ ఇచ్చారు. ఎప్పటిదో ఎందుకు అల వైకుంఠపురములో లైన్ సైతం ఎన్టీఆర్ ఇంటిగుట్టు లైన్ ని పోలి ఉందని చెప్పినవారు ఎందరో.
ఇదిలా ఉండగా త్రివిక్రమ్ కు మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ ఎంటర్ టైనర్ ‘మంత్రి గారి వియ్యంకుడు’ మీద ఎప్పటి నుంచో మనసు ఉందట. దాన్ని ఇప్పటి జెనెరేషన్ కు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన నమ్మకమట. ఇది నిజమో కాదో అఫీషియల్ సోర్స్ లేదు కానీ మొత్తానికి టాక్ అయితే ఫిలిం నగర్ లో జోరుగా ఉంది. నిజ జీవితంలో మామ అల్లుళ్లయిన అల్లు రామలింగయ్య చిరంజీవి ఈ సినిమాలోనూ అవే పాత్రలు పోషించారు. బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ వినోదాత్మక చిత్రం అప్పట్లో ఖైదీ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రిలీజ్ అవ్వడం వల్ల పెద్ద స్థాయికి చేరుకోలేదు.
కానీ కాలక్రమేణా దీన్ని వీడియోలో టీవీలో చూశాక ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి గుర్తింపు ఇచ్చారు. డబ్బున్నవాళ్లంటేనే గౌరవించి స్వంత బిడ్డల ప్రేమను తాకట్టు పెట్టడానికి వెనుకాడని ఓ పెద్దమనిషికి హీరో బుద్ధిచెప్పడమే దీని కథ. నిజానికి ఇందులో బోలెడు ఫన్ ఉంటుంది. మొదట జూనియర్ ఎన్టీఆర్ ను ఇలాంటి ప్లాట్ తోనే మెప్పించేందుకు త్రివిక్రమ్ ట్రై చేశారట. కానీ అది ఓకే అయ్యిందో లేక వేరే సబ్జెక్టుతో ప్రొసీడ్ అవుతున్నారో తెలియదు కానీ విడుదలయ్యాక క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఇది కాకపోయినా మున్ముందు మాత్రం మంత్రి గారి వియ్యంకుడు ఏదో ఒక రూపంలో రావొచ్చట. చూద్దాం.