iDreamPost
android-app
ios-app

చెయ్యేరు,అన్నమయ్య ప్రాజెక్ట్ ప్రయాణం

చెయ్యేరు,అన్నమయ్య ప్రాజెక్ట్ ప్రయాణం

చుట్టూ పచ్చని కొండల మధ్యన, జన సందోహానికి దూరంగా ప్రశాంతమైన శేషాచల ప్రకృతి అందాల మధ్యన అదొక సుందరమైన ప్రాజెక్ట్, బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. తెలియదు అనేకంటే ప్రజల దృష్టి దాని మిందికి వెళ్లలేదు అనడం కరెక్టేమో. అంతెందుకు సోమశిల అందాల గురించి నడుస్తున్న చర్చలో క్రాంతి అన్న అన్నమయ్య ప్రాజెక్టు గురించి చెప్పేంత వరకూ రాయలసీమలో అదీ మన జిల్లాలో అంత అందమైన ప్రదేశం ఉందని తెలియనే లేదు.తెలియలేదు అంటే పెన్నా నది ఉపనది అయిన చెయ్యేరు నదిపైన రాజంపేట చుట్టుపక్కల అన్నమయ్య పేరుమింద ఒక ప్రాజెక్టు ఉంటుందని మాత్రమే తెలుసు.

నాకు ఊహ తెలిసిన తర్వాత చెయ్యేరు నది వరదల గురించి ఏనాడు చిన్న వార్తైనా వినింది లేదు. ఎప్పుడైనా తిరుపతో, రాజంపేటో వెళ్లేటప్పుడు చెయ్యేరును చూస్తే నది వుడల్పుగానే ఉంటుంది గానీ ఏనాడు చుక్క నీటిని చూసి ఎరుగను. ఇసుక కూడా తెల్లగా మెరుస్తూ ఎండాకాలంలో ఎడారిలా వెక్కిరిస్తుంది.

అందువల్లేనేమో దానిమింద కట్టిన ప్రాజెక్ట్ అంటే ఏముంటదిలే చూసేదానికి అని మనకు తెలియకుండానే ఒక రకమైన నిర్లక్ష్య భావం మదిలో పేరుకుపోయింది కాబోలు. అయితే క్రాంతి అన్న పంపించిన ఫోటో చూశాక వెళ్లి చూడాల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి చేరింది.

మనసుంటే మార్గముంటది అన్నట్టు ప్రత్యేకంగా అన్నమయ్య ప్రాజెక్టు కోసం అని బయల్దేరలేదు గానీ ఈ ప్రాజెక్టు లాగే అద్భుతమైన టాలెంట్ ఉన్నా బయటి సమాజం నుంచి పెద్దగా గుర్తింపుకు నోచుకోని రాయలసీమ జానపద కళాకారుడు చంద్రన్నను కలవడానికి రైల్వే కోడూరుకి వెళ్తుండగా మధ్యలో ఇది గుర్తొచ్చింది. రాజంపేట నుండి పదిహేడు కిలోమీటర్లు. మరీ దూరమేం కాదు. గంట అయితే వెళ్లి రావొచ్చు కదా అని బోయినపల్లె వద్ద ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు అనే ఆర్చ్ దగ్గర బండిని దక్షిణంకు తిప్పాం.

Also Read:బండేరు కోన అందాలు

చెర్లోపల్లె చెరువు నిండు కుండలా తొణికిసలాడుతుండగా దాని అందాలను చూస్తూ ముందుకు సాగాం. దారికి అటు ఇటుగా ఎక్కడ చూసినా దాదాపూ అరటి తోటలే. పాత చాలం నాటి రాతి కటవలు, రోడ్డుకు తోరణంలా అటు ఇటు పెరిగి అల్లుకుపోయి ఉన్న చింత చెట్లు గత చరిత్ర తాలూకు ఔన్నత్యాన్ని తెలుపుతూ ఉన్నాయి. ఈ మధ్య పదుతున్న వరుస వర్షాల ప్రభావం ఆ ప్రాంతంలో అంతగా కనపడలేదు గానీ కొండలు, తిప్పలు గెడ్డినే పచ్చని చీరగా కట్టినాయా అన్నట్టున్నాయి.

దాదాపూ పది కిలోమీటర్లు అంటే ఆకేపాడు వరకూ డబల్ రోడ్డు ఉంది అక్కడక్కడా రిపేర్లు ఉండడంతో మెటల్ తో కవర్ చేశారు. ఆ తర్వాత సింగిల్ తారు రోడ్డు. అది కూడా మెయింటెనెన్స్ సరిగా లేక అక్కడక్కడా పాడైపోయి ఉంది అయితే మరీ ప్రయాణానికి ఇబ్బంది కలిగించేంత కాదు.

చుట్టుపక్కలున్న బీడు భూముల్లో ఆవులను మేపుకుంటూ ముసలోళ్లు కనిపిస్తున్నారు. అక్కడక్కడా బర్రెలు ఉన్నా అవన్నీ నాటు బర్రెలే. హైబ్రిడ్ బర్రెల సంస్కృతి ఇంకా పూర్తిగా చేరినట్టులేదు. ప్రాజెక్టుకు దగ్గరయ్యే కొద్ది జనసంచారం దాదాపూ తగ్గింది. పల్లెలు కూడా లేవు.

అక్కడక్కడా చేపలు పట్టేవాళ్లు మాత్రం కనిపిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిగా కొండల మధ్యన ఉంది అనే దానికి సూచనగా ఘాట్ రోడ్ మొదలైంది. ఈ మధ్య పడిన వర్షాలకు రాళలలసందున కూడా గెడ్డి మొలిచి బాగా ఏపుగా పెరిగి ఉంది. శేషాచల పాద ప్రాంతపు కొండలే అయినా అడవి అంత దట్టమైనది కాదు. అన్నీ చిన్న చిన్న చెట్లే. నల్ల తుమ్మకు దగ్గరి పోలికలున్న కొత్త రకం అకేసియా జాతి మొక్క అక్కడ కనపడింది. పూలు కూడా నల్లతుమ్మ, సీమతుమ్మ లాగా పొడవుగా ఉన్నాయి.

Also Read:కోనసముద్రం – కొత్త చరిత్ర

ఘాట్ రోడ్ దాదాపూ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. ఆ నాలుగు కిలోమీటర్లు కూడా ప్రాజెక్టు చుట్టూ తిరిగడం వల్ల అదో రకమైన చొత్త అనుభూతినిస్తుంది. ఒక్కో వ్యూ పాయింట్ నుంచి ఒక్కో అందం మనసును కుదురుగా ఉండదు. ఒక దాన్ని మించి మరొకటి అన్నట్టుగా ఉండగా చూస్తూ చూస్తూ ప్రాజెక్టు కట్ట దగ్గరికి వెళ్లగానే చుట్టూ సహజ సుందర ప్రకృతిని తన వస్త్రంగా తొడిగి మధ్య మానవ నిర్మిత కట్టడం తన అందాన్ని మరింత పెంచుకుందా అన్నట్టుగా అనిపించింది.

ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్లేసరికి రెండు కొండల మధ్యన సన్నగా మారిన చెయ్యేటిని చూసి ఆశ్చర్యంగా అనిపించింది. నందలూరు దగ్గరున్న వెడల్పాటి చెయ్యేరు ఇదేనా అనిపించకమానదు. పాపయ్య శాస్త్రిలాంటి భావ కవి గానీ చూస్తే అమ్మాయి నడుమొంపులతో పోలుస్తాడు కాబోలు.

అదంతా చూశాక సినిమా జనాల కన్ను ఇంకా పడినట్టు లేదు గానీ పడితే మన చుట్టుపక్కలే ఉన్న ఒక అద్భుత ప్రపంచాన్ని పరిచయం చెయ్యవచ్చేమో అనిపించింది. అంత బాగుంది అక్కడ.

గవర్నమెంట్ వాళ్లు పట్టించుకుని దాన్నొక ఎకో-టూరిజం ప్రాజెక్టుగా ప్రకటించి సందర్శకుల కోసం శేశాచల అందాలు చూపించేలా బోటింగ్, ప్రకృతిలో తిండి, వసతి సౌకర్యాలు కల్పించగలిగితే అతి తక్కువ ఖర్చుతో ప్రభుత్వానికి మరింత ఆదాయం తీసుకురాగలదనడంలో సందేహం లేదు.