iDreamPost
android-app
ios-app

Kakinada,kotipalli – రైల్‌ బస్సు ప్రయాణం మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో..?

  • Published Nov 12, 2021 | 5:31 AM Updated Updated Mar 11, 2022 | 10:35 PM
Kakinada,kotipalli – రైల్‌ బస్సు ప్రయాణం మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో..?

‘ప్రయాణీకులకు ముఖ్య గమనిక. రైలు నెంబరు 77271 కాకినాడ నుంచి కోటిపల్లి వెళ్లే రైలు మరి కొద్దిసేపట్లో ఒకటో నెంబరు ప్లాట్‌ఫామ్‌ మీదకు రానుంది’ అని ప్రకటించగానే కాకినాడ టౌన్‌ రైల్వేస్టేషన్‌లో ఈ ట్రైన్‌ కోసమే కాదు.. ఇతర ట్రైన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణీకుల్లో సైతం ఆసక్తి నెలకొనేది. సాధారణంగా రైలు అంటే ముందు ఇంజన్‌.. వెనుక భోగీలు ఉంటాయి. కాని ఈ నెంబరు గల సర్వీసు మీద మాత్రం రైలు బస్సు నడిచేది. పేరుకు పట్టాలు మీద నడిచేదే కాని అచ్చు ఆర్టీసీ బస్సులానే ఉండేది. అందుకే ఈ ట్రైన్‌ వస్తుందంటే కాకినాడ టౌన్‌ స్టేషన్‌లోనే కాదు.. రైల్‌ బస్సు ప్రయాణం సాగే పొడవునా రోడ్డు మీద వెళ్లేవారు.. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు దీనిని ఆసక్తిగా గమనిస్తుండేవారు. అయితే కోటిపల్లి నుంచి కాకినాడ మధ్య నడిచే రైల్‌ బస్సు ఆదాయం గోరెడు.. ఖర్చు మూరడు అన్నట్టుగా మారిందని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే దీనిని నిలుపుదల చేసింది. 2004లో పుననిర్మాణం జరిగిన తరువాత కాకినాడ నుంచి కోటిపల్లి వరకు ఏడు బోగీలతో పాసింజర్‌ రైలు నడిపారు. ఇది లాభసాటిగా లేదని మూడేళ్ల తరువాత దాని స్థానంలో రైల్వే బస్సు మొదలు పెట్టారు.

Also Read : Konaseema Cyclone – కోనసీమ విషాదానికి పాతికేళ్లు


పర్యాటకులను ఆకట్టుకున్న రైల్‌ బస్సు:

రైల్‌ బస్సు సైతం ఆగుతూ సాగుతూ సాగింది. పేరుకు ట్రైన్‌ అయినా అంతా బస్సులా ఉండేది. దీనిలోనే టిక్కెట్‌ ఇచ్చేవారు. సింగిల్‌ ట్రాక్‌.. సింగిల్‌ బోగి అన్నట్టుగా ప్రయాణం సాగిపోయేది. కాకినాడ నుంచి కోటిపల్లి ఆర్టీసీ బస్సు టిక్కెట్‌ ధర రెండేళ్ల క్రితం రూ.35 ఉండగా, అప్పట్లో రైలు బస్సు టిక్కెట్‌ ధర రూ.పది మాత్రమే ఉండేది. దీనితో కొంతమంది ఈ రైలు బస్సు మీద రాకపోకాలు సాగించేవారు. పచ్చని పొలాలు.. కొబ్బరి చెట్లు, తాటిచెట్లు.. పంట కాలువలు.. పంట పొలాల్లో పనిచేసే కూలీలు… ఇలా దారిపొడవునా ఆకట్టుకునే ఆందాలతో ప్రయాణం కనువిందు చేస్తూ.. కుదుపు లేకుండా సాగిపోయేది. పర్యాటకులు సైతం ఈ రైలు బస్సు మీద రాకపోకలు సాగించేందుకు ఉత్సాహం చూపేవారు. రైల్వేగేట్‌ ఉన్న చోట సిబ్బంది దిగి గేటు వేయడం, తీయడం చేసేవారు. 45 కిలోమీటర్ల ప్రయాణం ఆహ్లాదకరంగా సాగేది. కాని ఒక ట్రిప్‌కు 45 లీటర్లు డీజిల్‌ అయితే కేవలం రూ.200 నుంచి రూ.300 వరకు మాత్రమే వస్తుందని, పైగా దీని నిర్వహణకు ఆరుగురు సిబ్బంది అవసరమని ఎస్‌సీ రైల్వే అధికారిలు రెండేళ్లుగా రాకపోకలు నిలిపివేశారు. దీనిని పునరుద్ధరించమని ప్రయాణీకులు కోరుతున్నా అధికారుల చెవికెక్కడం లేదు.

Also Read : P Gannavaram Aqueduct – 1851 లో నిర్మించిన పి.గన్నవరం అక్విడెక్టు గురించి తెలుసా..?

నష్టాలకు రైల్వే అధికారులే కారణమనే ఆరోపణలున్నాయి. కాకినాడలో ఈ రైలు ఉదయం 9.30 గంటలకు బయలు దేరి మధ్యాహ్నం 11.30 గంటలకు కోటిపల్లి చేరేది. తిరిగి ఇక్కడ నుంచి 12 గంటలకు మొదలై కాకినాడ రెండు గంటలకు చేరేది. సమయం మార్పులు చేస్తే మంచి ఆదాయం వస్తుందని స్థానికులు చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. ఉద్యోగులు, విద్యార్థుల రాకపోకలకు అనువుగా సమయం నిర్ణయించి ఉంటే రైలు బస్సుకే కాదు.. పాసింజర్‌ రైలుకు సైతం మంచి ఆదాయం వస్తుందని చెప్పినా అధికారులు పట్టనట్టుగా వ్యవరించారు. చివరకు నష్టాల సాకుతో దీనిని నిలిపివేశారు. అధికారులు తీరు చూస్తుంటే నర్సాపురం వరకు రైల్వే లైన్‌ పూర్తయితే కాని కాకినాడ ` కోటిపల్లి ట్రాక్‌ మీద రైళ్లు నడిచే అవకాశం లేదన్నట్టుగా ఉంది.

Also Read : Konaseema Railway Line – కోనసీమలో రైల్వే కూతకు ఇంకా ఎంతకాలం?