Idream media
Idream media
రైతులతో కేంద్రం చర్చలు కొనసాగిస్తూనే ఉంది. శుక్రవారం మరోసారి కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఆ చర్చలకు ముందు ప్రభుత్వానికి సవాల్ విసిరేందుకే అన్నట్లు ఢిల్లీ శివార్లలో రైతన్న ట్రాక్టర్లతో కదం తొక్కాడు. వేల మంది రైతులు పంజాబ్, హరియాణా, ఢిల్లీ శివార్ల నుంచి నాలుగు మార్గాల మీదుగా దాదాపు 3,500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో 43 రోజులుగా చలి, వర్షాలను లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్న రైతులు.. గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్లతో ఢిల్లీ ముట్టడికి నిర్వహించ తలపెట్టిన ‘కిసాన్ పరేడ్’ కార్యక్రమానికి గురువారం నాటి ట్రాక్టర్ల ర్యాలీ ఓ రిహార్సల్ లాంటిదని రైతు సంఘం నేతలు అభివర్ణించారు.
ఇప్పటికే ఏడు సార్లు..
కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికి ఏడు సార్లు చర్చలు జరిగినా.. ఫలవంతం కాకపోవడంతో.. భవిష్యత్ కార్యాచరణను అమలు చేస్తామని 40 రైతు సంఘాల నేతలు ఈ సందర్భంగా నినదించారు. శుక్రవారం మరోసారి కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలు చర్చలు జరపనున్న నేపథ్యంలో.. కిసాన్ పరేడ్‌కు తమ ర్యాలీ సన్నాహకంగా నిలిచిందని వారు పేర్కొన్నారు. ఈ నెల 23న వివిధ రాష్ట్రాల రాజ్‌భవన్‌లకు ట్రాక్టర్ల ర్యాలీ తీస్తామని చెప్పారు. దేశరాజధానికి సరిహద్దు ప్రాంతాలైన సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌తోపాటు.. హరియాణాలోని రేవాసన్ నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ట్రాక్టర్ల ర్యాలీ.. సాయంత్రానికి చిల్లా సరిహద్దు వద్ద ఒకచోటికి చేరుకుంది. నిజానికి బుధవారమే ట్రాక్టర్ల ర్యాలీ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా గురువారానికి వాయిదాపడింది. కాగా.. అమెరికాలోని టెక్సాస్‌లో చదువుకుంటున్న నవ్‌పాల్ సింగ్ అనే విద్యార్థి రైతులకు మద్దతుగా ఈ నెల 18న ఆందోళనలో పాల్గొననున్నారు. తనకు వ్యవసాయంతో సంబంధం లేదని, అయినా.. రైతుల కోసం ఆందోళనలో పాల్గొంటానని నవ్‌పాల్ వివరించారు.
భారీ బందోబస్తు..
రైతుల ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హరియాణా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు.. నగర సరిహద్దుల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. బ్యారీకేడ్లను ఏర్పాటు చేసి.. రైతులు నిర్ణీత ప్రాంతానికి మించి ఢిల్లీ వైపు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ వాహనదారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ర్యాలీ జరుగుతున్న మార్గాల్లో సరిహద్దులను మూసివేశారు. ఆ రహదారుల మీదుగా వెళ్లాల్సిన వాహనదారులకు ప్రత్యామ్నాయాలను సూచించారు. ఢిల్లీ పోలీసులు ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా ట్రాఫిక్ పరిస్థితిని వివరిస్తూ.. అప్‌డేట్‌లను అందజేశారు.