Idream media
Idream media
ఐదు కాళ్ల మనిషి పుస్తకంలోని మొదటి కథ “రేపు” చదవగానే అర్థమైంది నా చేతిలో ఉన్నది సాధారణమైన పుస్తకం కాదని. శ్రీలంకకి చెందిన ప్రముఖ తమిళ రచయిత ఎ.ముత్తులింగం రాసిన కథల్ని అవినేని భాస్కర్ అనువాదం చేశారు. ఛాయా సంస్థ ప్రచురించింది. మూలంలోని ఆత్మని తన బాధని అనువాదకుడు హృదయంతో గ్రహించాడు.15 కథల్ని ఆగకుండా చదివేశాను. నిద్రపట్టలేదు. కథల్లోని మనుషులు చాలా మంది నాకు తెలుసు. ఎక్కడో చూశాను.
శ్రీలంకలో తమిళుల బాధలు జర్నలిస్టుగా కొంచెం తెలుసు. మా పెద్దమ్మ కొడుకు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో పని చేశాడు. అతని మీద చాలా ఆశలు పెట్టుకున్నా కథలు చెబుతాడని. అయితే ఎంత బోర్‌గా చెప్పాడంటే మళ్లీ అడగాలంటేనే భయమేసింది. తర్వాత రాజీవ్ హత్య , ప్రభాకరన్ మరణం అన్నీ జరిగిపోయాయి.
కరోనా తర్వాత ఒక మిత్రుడు ప్రభాకరన్‌పై వెబ్ సిరీస్ చేద్దామని అన్నాడు. శ్రీలంక గురించి సీరియస్‌గా చదవడం మొదలు పెట్టా. యుద్ధమంటే కన్నీళ్లు, బాధలు, మృత్యువు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయినా, జాతుల సమస్యతో శిథిలమైపోయిన అమాయకుల జీవితాలు జ్ఞాపకాల్లో వుండిపోయాయి.
కాసింత తిండికోసం ఇద్దరు పిల్లలు కిలోమీటర్లు నడిచి వస్తారు. పైన తుపాకులతో ఉన్న హెలీకాప్టర్లు, కడుపులో ఆకలి. సూప్‌లో కాసింత మాంసం ముక్క ఉందేమోనని వెతుకులాట. రేపు దొరుకుతుందేమో అనుకుంటారు.
ఒకప్పుడు గంజి కరువులో ఇలాగే మైళ్లు నడుస్తూ వెళ్లారు. జి.రామకృష్ణ రాసిన గంజికరువు గుర్తొచ్చింది. ఒక ముసలమ్మ, కోడలు , మనుమళ్లతో వెళుతుంది. చివరికి గంజి దక్కక నిరాశతో వెళ్లిపోతుంది. కరువంటే మృత్యువు మారువేషం. యుద్ధం మరణపు నగ్న రూపం. యుద్ధ భూమిలో తుపాకుల నుంచి , ఆకలి నుంచి కాపాడుకోవాలి. రేపు కథ ఇదే.
టోరాబోరా వంట మనిషి చదివితే బషీర్ అనే కుక్ గుర్తొచ్చాడు. అతను అనాథ. తిరుపతి ఆంధ్రజ్యోతి క్యాంటీన్‌లో కొంత కాలం పనిచేశాడు. బిర్యానీ అద్భుతంగా చేసేవాడు. ఇది ఓనర్‌కి నచ్చేది కాదు. ఎందుకంటే బిర్యానీలోకి నెయ్యి, డ్రైప్రూట్స్ వేయాలనే వాడు. అవన్నీ వేస్తే గిట్టదని ఓనర్ బాధ. ఇవ్వకపోతే బషీర్ బండ బూతులు తిట్టేవాడు. క్వాలిటీ విషయంలో అంత పట్టింపు. కొంత కాలానికి మానేశాడు. కష్టాలు అతని చిరునవ్వుని చెరపలేకపోయాయి.
పది రోజులు కథలోని నవాజ్ నాకు ఎస్కే యూనివర్సిటీలో తగిలాడు. శివయ్య అనే అతనికి ఎవరూ లేరు. కర్నూల్ దగ్గర సొంత ఊరు. ఇల్లూ, వాకిలీ లేదు. ట్రంక్ పెట్టె అతని ఆస్తి. ఆ పెట్టెలో సిగరెట్లు, తినుబండారాలు, వక్క పొట్లాలు వుండేవి. పొద్దున్నుంచి రాత్రి 9 గంటల వరకూ కృష్ణా హాస్టల్ ముందు అమ్ముకునే వాడు. రాత్రి క్యాంటీన్ దగ్గర నిద్రపోయే వాడు. అర్ధరాత్రి సిగరెట్లు అవసరమైతే లేపేవాళ్లం. విసుక్కునే వాడు కాదు. ఆ వ్యాపారంలో ఏం లాభాలొస్తాయో, ఎక్కడ తిండి తినేవాడో తెలియదు. మాసిపోయిన తెల్ల చొక్కా, అడ్డ పంచె, కాళ్లకి స్లిప్పర్స్. రోడ్డు మీద జీవించే అతని కళ్లలో నిరంతరం మెరిసే సంతోషం ఇప్పటికీ నాకూ పజిల్.
ప్రారంభం కథలోని పక్షిని కడప జిల్లా పెద్దుళ్లపల్లిలో చూశాను. ఆ వూరికి ప్రతి ఏటా కొన్ని వందల కొంగలు దూర దేశం నుంచి వలస వస్తాయి. ఆ గ్రామస్తులు జాగ్రత్తగా కాపాడుతారు. ఇది తెలిసి 25 ఏళ్ల క్రితం వెళ్లాను. ఎగురుతున్న ఒక పక్షి హఠాత్తుగా కింద పడి చనిపోవడం ఒక ఫొటోలా మెదడులో వుండిపోయింది.
ఆహావి కథ షాక్ నుంచి చాలా సేపు కోలుకోలేదు. మణిరత్నం అమృత సినిమా చూసినట్టనిపించింది. యుద్ధంలో మగవాళ్లు చనిపోతారు. ఆడవాళ్లు బతికున్న శవాళ్లా జీవిస్తారు. ఒక్కోసారి శత్రువు పాపాన్ని కడుపులో మోస్తూ!
భారం కథ కాలాన్ని వెనక్కి తీసుకెళ్లింది. 30 ఏళ్ల క్రితం కొత్తగా బజాజ్ స్కూటర్ కొన్నాను. తిరుపతిలోని ఒక వీధిలో వెళుతుంటే చిన్న కుర్రాడు వచ్చి ఢీకొన్నాడు. అక్కడున్న వాళ్లు “మీ తప్పేం లేదు, ఇక్కడంతా రౌడీ కుర్రాళ్లు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు వెళ్లిపోండి” అని చెబితే కంగారు, భయంతో ఉన్న నేను స్కూటర్ స్టార్ట్ చేసుకుని వచ్చేశాను.
కానీ ఆ పిల్లవాడికి ఏమైనా అయ్యిందేమో అనే దిగులు చాలా ఏళ్లు వెంటాడింది.
ఐదు కాళ్ల మనిషి కుంటి మారన్న. 45 ఏళ్ల క్రితం రాయదుర్గంలో జట్కా తోలేవాడు. ఒక కాలికి పోలియో. గుర్రానికి నాలుగు, ఇతనికి ఒకటి. మొత్తం ఐదు కాళ్లు. ఒక రోజు గుర్రం చనిపోయింది. ఆ బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్లోరిడా స్టేట్‌లోని జాక్సన్‌విల్లీ సిటీలో ఐదు నెలలున్నాను. ఒకసారి బౌలింగ్‌కి వెళితే రాత్రి 12 గంటల సమయంలో ఒక ఆప్రో అమెరికన్ ముసలాయన తనలో తాను గొణుక్కుంటూ క్లీనింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో అంత కష్టపడుతుంటే బాధగా అనిపించింది.
హెలన్ లాంటి స్త్రీ కీవెస్ట్‌లో కనిపించింది. ఇది అమెరికా బార్డర్. ఇక్కడి నుంచి సముద్రంలో కొంత దూరం వెళితే క్యూబా.
మోకాళ్ల వరకూ గౌన్ వేసుకున్న ఒక వృద్ధురాలు ఒంటరిగా డ్యాన్స్ చేస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ వుంది. ఆ కళ్లలో దారుణమైన ఒంటరితనం , దిగులు కనిపించాయి.
మెట్రో స్టేషన్‌లోని రైలు అమ్మాయి కూడా తెలుసు. న్యూయార్క్‌లో ఒక మంచు రాత్రి ఆమె మెట్రో రైలు మిస్ అయ్యింది. ఫోన్ స్విచ్ఛాప్ అయ్యింది. ఆమె మేనమామ తెల్లవార్లు ఆమె కోసం ఎదురు చూశాడు. ఎదురు చూడ్డం ఆయనకి కొత్తకాదు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ శిథిలాల కింద చనిపోయిన భార్య కోసం 20 ఏళ్లుగా ఎదురు చూస్తూనే వున్నాడు.
ఇల్లు లేని సోమాలీలు, పరాయి దేశంలో ఎంత దుర్భరంగా జీవిస్తారో తెలుసు. మియామి చాలా అందమైన నగరం. ఒక అర్ధరాత్రి మియామిలో ప్రవేశించి , అందానికి ఆనందిస్తూ వుండగా, ఫుట్‌పాత్ మీద దోమతెరల్లో జీవిస్తున్న అనేక మంది కనిపించారు. వాళ్లంతా Homeless.
తమ దేశాల్లో బతకలేక , అమెరికాలో బతకొచ్చని అక్రమంగా వస్తారు. అధికారులు చూసీచూడనట్టు వుంటారు. కూలీ పనులన్నీ వాళ్లు సగం డబ్బులకే చేస్తారు. వానకి , చలికి, ఆకలికి తట్టుకుంటూ బతకాలి. చచ్చిపోతారు కూడా. వీళ్లని చూసిన తర్వాత విన్స్ వుడ్ రోడ్డులోని వాల్ పెయింటింగ్స్ కూడా రక్తం రంగులోనే కనిపించాయి.
ప్లాట్ల రేట్లు , రియల్ ఎస్టేట్ లెక్కలు , లలితా జ్యువెలరీ యాడ్స్ , గాసిప్స్, ఇంటికి కొట్టాల్సిన రంగులపై సుదీర్ఘ చర్చ. ఇవే మీకిష్టమైతే ఈ పుస్తకం చదవకండి. టైం వేస్ట్.
ఈ లోకంలో ఆకలి, కన్నీళ్లు, యుద్ధం ఉన్నాయని , బలహీనులు బాధితులు ఉన్నారని నమ్మితే చదవండి. నిద్రపట్టదు.
ఇన్‌సోమ్నియా మనుషులకి మాత్రమే వుండే జబ్బు.