iDreamPost
android-app
ios-app

డిసెంబర్ 30 – చివరి గెలుపు ఎవరిది ?

  • Published Dec 28, 2022 | 8:07 PM Updated Updated Dec 28, 2022 | 8:07 PM
డిసెంబర్ 30 – చివరి గెలుపు ఎవరిది ?

ఇంకొక్క వారం దాటకుండానే 2022 గుడ్ బై చెప్పి వెళ్ళిపోనుంది. న్యూ ఇయర్ సంబరాలకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అయితే ముగింపు మాత్రం టాలీవుడ్ కు అంత జోష్ ఇచ్చేలా కనిపించడం లేదు ఏవైనా అనూహ్య ఫలితాలు అందుకుంటే తప్ప. ఈ నెల 30 శుక్రవారంతో పాటు శనివారం చెప్పుకోదగ్గ నెంబర్ లో సినిమాలు రిలీజవుతున్నాయి కానీ దాదాపుగా అన్నీ బజ్ లేనివే. పబ్లిక్ టాక్ వస్తే తప్ప జనం రాని పరిస్థితి. ఆది సాయికుమార్ ‘టాప్ గేర్’ వెరైటీ టైటిల్ తో పాటు ట్రైలర్ ని ఆకట్టుకునేలా చేసింది కానీ కంటెంట్ ఏ మాత్రం ఉందో థియేటర్లో చూస్తే కానీ చెప్పలేం. ఫ్లాపులతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తున్న ట్రాక్ రికార్డు తనది

బిగ్ బాస్ సోహైల్ టైటిల్ రోల్ పోషించిన ‘లక్కీ లక్ష్మణ్’ ని ఈ వారమే దించుతున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి హైప్ ని సృష్టించలేకపోయారు. ఈ మధ్య రొట్ట రొటీన్ కంటెంట్ ఉన్నప్పటికీ గాలోడుతో సుడిగాలి సుధీర్ సంచలనం రేపడంతో ఇలాంటి వాటిని మరీ తేలిగ్గా తీసిపారేయలేం. ఇటీవలే టిడిపి తరఫున రాజకీయ రంగప్రవేశం చేసిన తారకరత్న ‘S5’ థ్రిల్లర్ కథాంశంతో వస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రధాన పాత్రలు పోషించిన ‘రాజయోగం’ టైటిల్ కు తగ్గట్టు ఉందో లేదో మరి. నెపోలియన్ తో అప్పుడెప్పుడో పలకరించిన టీమ్ ‘కోరమీను’తో వస్తోంది. డిఫరెంట్ సబ్జెక్టు అయ్యుంటుందన్న టాక్ అయితే ఉంది కాబట్టి అది నిలబెట్టుకోవాలి.

ఇవి కాకుండా ప్రేమ దేశం, ఉత్తమ విలన్ కేరాఫ్ మహదేవపురం, నువ్వే నా ప్రాణం లాంటి చిన్న చిత్రాలు కూడా రేస్ లో ఉన్నాయి. గత వారం వచ్చిన ధమాకాకు మాస్ ఆడియన్స్ సపోర్ట్ ఉండటంతో భారీ వసూళ్లు దక్కాయి. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే వీకెండ్ మళ్ళీ రవితేజ కంట్రోల్ లోకే వెళ్లేలా ఉంది. ఒకవేళ పైన చెప్పిన లిస్టులో ఒకటి రెండు బాగున్నాయనే టాక్ తెచ్చుకుంటే జనవరి 10 దాకా స్లాట్ దొరికినట్టే. 11 నుంచి మొదలుకాబోయే రచ్చకు భయపడి ఆ మధ్య ఎవరూ కొత్త రిలీజులు ప్లాన్ చేసుకోలేదు. సో అప్పటిదాకా ఫీడింగ్ కోసం థియేటర్లకు ఇవి తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అవతార్ 2 ది వే అఫ్ వాటర్ స్టడీగా తన పరుగుని కొనసాగిస్తోంది