iDreamPost
android-app
ios-app

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం… భయందోళనలో స్థానికులు!

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం… భయందోళనలో స్థానికులు!

ప్రస్తుతం ఎండకాలం కొనసాగుతోంది. దీంతో సూర్యతాపానికి జనాలు విలవిల్లాడి పోతున్నారు. ముఖ్యంగా అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రగాయాలతో జీవితాన్ని నరక ప్రాయంగా అనుభవిస్తున్నారు. అంతేకాక ఈ ప్రమాదాల కారణంగా కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా జరుగుతుంది.  తాజాగా తిరుపతి లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. షాపులో భారీగా మంటలు చెలరేగాయి. ఈ షాపు ఉన్నది రద్దీగా ఉండే ప్రాంతంలో కావడంతో అందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఎగసి పడుతున్న మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.  గోవిందరాజస్వామి ఆలయ రథం ఉన్న వైపు మంటలు వస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పేశారు. గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలో ఐదంతస్తుల భవనంలోని ఓ ఫ్లోర్‌లో ఈ ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ దుకాణం  ఉంది. అందులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంతో కోట్ల రూపాయల విలువైన ఫొటోలు దగ్ధమైనట్లు నిర్వహకులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది  మూడు వాహనాల్లో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు భవనం ముందు ఉన్న ఐదు బైక్ లు పూర్తిగా కాలిపోయాయి. మంటలు చెలరేగడంతో ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. భవనంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక  ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరి.. ఇలా వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.