iDreamPost
android-app
ios-app

విడాకుల కేసు విషయంలో జడ్జి కారు పగులగొట్టిన భర్త!

విడాకుల కేసు విషయంలో జడ్జి కారు పగులగొట్టిన భర్త!

భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సాధారణం. అయితే నేటికాలంలో మాత్రం దంపతుల మధ్య జరుగుతున్న ఘర్షణలు  తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇద్దరిలో అహం అనేది నిండి.. ఎడబాటుకు దారి తీస్తుంది. ఇలా ఎంతో మంది దంపతులు  విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అయితే కోర్టు ఇచ్చే తీర్పులపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై కొందరు కోపం పెంచుకుంటారు. ఈ క్రమంలో న్యాయమూర్తులపై, వారి వాహనాలపై దాడులకు తెగ పడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి.. విడాకుల కేసులో అసంతృప్తి చెంది.. జడ్జి కారు అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.

కేరళ రాష్ట్రం పథనం తిట్ట జిల్లాలోని ప్రాంతంలో ఓ  దంపతులు విడాకుల  కోసం తిరువళ్లా కోర్టు మెట్లు ఎక్కారు. వీరి విడాకుల కేసు ఆరేళ్లుగా కోర్టులో  కొనసాగుతూనే ఉంది. ఇలా ఏళ్ల తరబడి కేసు సాగుతున్నా విడాకుల వ్యవహారానికి  సంబంధించి కోర్టులో తనకు సహజన్యాయం దక్కడం లేదనే భర్త(55) అసంతృప్తితో రగిలిపోయాడు. న్యాయమూర్తి తనకు  న్యాయం చేయలేదని అసంతృప్తితో కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే కేసు విచారణకు వచ్చి సదరు వ్యక్తి ఫ్యామిలీ కోర్టు ఆవరణలో ఉన్న జడ్జి కారుపై ఆ కోపం తీర్చుకున్నాడు. విచారణ అనంతరం కోర్టు నుంచి బయటకురాగానే ఎదురుగా  న్యాయమూర్తి కారు కనిపించింది. దీంతో జడ్జీపై ఉన్న కోపం అతడిలో కట్టలు తెంచుకుంది. ఆ భర్త అద్దాలన్నీ పగులగొట్టి, నొక్కులు పడేలా దానిపై దాడికి దిగాడు.

వెంటనే నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ‘‘భార్యే అతడిపై విడాకుల పిటిషను దాఖలు చేసింది. న్యాయమూర్తి, న్యాయవాది కుమ్మక్కై తన ఆవేదనను సరిగా వినిపించుకోవడం లేదన్నదే అతడి కోపానికి కారణం’’ అని వారు తెలిపారు. స్థానికుల్లో  కొందరు అతడిని సమర్ధించగా, మరికొందరు వ్యతిరేకించారు. మరి.. మనిషి ఆవేదను అర్థం చేసుకోనప్పుడు ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటాయని కొందరు అభిప్రాయపడ్డారు. ఎలాంటి పరిస్థితులోనైనా సహనంగా ఉండాలని మరికొందరు హితవు పలుకుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.