P Krishna
P Krishna
ఈ మద్య మానవ సంబంధాలు పూర్తిగా మంటకలిసిపోతున్నాయని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. వివాహం జరిగిన ఏడాదికే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం.. కోర్టు మెట్లు ఎక్కడం సర్వసాధారణం అయ్యింది. ఇక వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో ఆరని చిచ్చుపెడుతున్నాయి. కొంతమంది మద్యం మత్తులో క్షణికావేశం ఎన్నో అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. పిలల్లు అంటే పంచ ప్రాణాలతో చూసుకుంటారు తల్లిదండ్రులు.. కానీ ఓ తల్లిదండ్రులు తమ కొడుకును సుపారీ ఇచ్చి మరీ చంపించిన ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కన్న పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటారు. సమాజంలో తమ పిల్లలు గొప్ప పొజీషన్ లో ఉండాలని.. భార్యా పిల్లలతో సంతోషంగా గడపాలని కోరుకుంటారు. తమ పిల్లలకు ఏ చిన్న ప్రమాదం జరిగినా విలవిలాడిపోతారు. అలాంటిది తమ కొడుకును సుపారీ ఇచ్చి మరీ చంపించిన తల్లిదండ్రుల దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 10న అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తి దుర్గా ప్రసాద్(35) గా గుర్తించారు. కొంత కాలంగా తల్లిదండ్రులతో జరిగిన గొడవల కారణంగా ఈ హత్య జరిగిందని అన్నారు.
దుర్గా ప్రసాద్ కి తల్లిదండ్రులు పగిల్ల సావిత్రి, రాముల మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే దుర్తా ప్రసాద్ తరుచూ మద్యం తాగి వచ్చి ఇంట్లో పెద్ద గొడవ చేసేవాడు. కొడుకుకి ఎంత నచ్చజెప్పినా రోజు రోజుకీ అతని అకృత్యాలు పెరిగిపోయాయి. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు ఇల్లు అమ్మి వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన దుర్గా ప్రసాద్ తనకు తెలియకుండా ఇల్లు అమ్మితే చంపేస్తానని బెదిరించాడు. ఇక కొడుకు పెట్టే హింసలు భరించలేక అతని అడ్డు తొలగించాలని నిర్ణయానికి వచ్చారు.
భద్రాచలం పట్టణంలో జగదీశ్ కాలనీకి చెందిన గుమ్మడి రాజ్, షేక్ అలీపాష కూ రూ. 3 లక్షలు సుపారీ ఇచ్చి తమ కొడుకును చంపాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 9న పక్కా పథకం ప్రకారం సుపారీ ఇచ్చిన ఇద్దరు దుండగులతో తల్లిదండ్రులు దుర్గా ప్రసాద్ ని కత్తితో పీక కోసి హతమార్చారు. తర్వాత మృతదేహాన్ని ఆటోలో తుమ్మల నగర్ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టి పారిపోయారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నెల 25న చత్తీస్ గఢ్ వైపు వెళ్తున్నట్లు సమాచారం అందిన వెంటనే నలుగురిని అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ మహేందర్‌రెడ్డి తెలిపారు.