iDreamPost
iDreamPost
తిరుపతి ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపికి నరసరావుపేట వాసి మూలంగా ఎన్నికల ముంగిట పెద్ద ఎదురు దెబ్బ తగిలింది . బీజేపీతో పొత్తులో భాగంగా తిరుపతి పార్లమెంట్ బరిలో పోటీకి నిలవకుండా బిజెపికి మద్దతు ఇచ్చిన జనసేన అధినేతకు ఎలెక్షన్ కమిషన్ షాకిచ్చింది . ఇప్పటివరకూ జనసేన గుర్తుగా ఉన్న గాజు గ్లాసును తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో నవతరం పార్టీ అభ్యర్థిగా నిలుచున్న నరసరావుపేట అభ్యర్థి గోదా రమేష్ కుమార్ కి కేటాయించడంతో బిజెపి , జనసేన గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది .
ఎవరీ గోదా రమేష్ కుమార్ …..
గుంటూరు జిల్లా , నరసరావుపేట నియోజకవర్గం నల్లగార్లపాడు గ్రామ నివాసి గోదా రమేష్ కుమార్ . దళిత బహుజన హక్కుల సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న గోదా రమేష్ సామాజిక సేవ ద్వారా పేరు తెచ్చుకోవటమే గాక తాను నిర్వహించిన సోషల్ సర్వీస్ లకు గుర్తింపుగా 2020 డిసెంబర్ లో హానరీ డాక్టరేట్ తో సత్కారం పొందారు . 2015 లో నవతరం పార్టీ సభ్యత్వం తీసుకొన్న రమేష్ కుమార్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు .
ప్రస్తుతం పార్టీ నిర్ణయం మేరకు తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిచిన వీరికి ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు గుర్తును కేటాయించడం విశేషం .
Also Read : రాయల సీమకు నీళ్లు ఇవ్వొద్దన్న బండి సంజయ్ తో ప్రచారమా ?
గత ఎన్నికల్లో జనసేనకి గాజు గ్లాసు గుర్తు కేటాయించగా ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా జనసేన బలం లేకపోవడంతో తమకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తుని శాశ్వత గుర్తుగా జనసేన నిలుపుకోలేకపోయింది . ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని నిలిపినా జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుని కాపాడుకొని ఉండేదేమో కానీ పొత్తులో భాగంగా తిరుపతి సీటు బిజెపికి వదులుకొని మద్దతు ఇవ్వటంతో పోటీలో లేని జనసేన గుర్తుని నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్ కి కేటాయించడంతో బిజెపి , జనసేన పార్టీలు తీవ్ర అయోమయంలో కూరుకుపోయాయి .
తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు పై ఆశ లేకున్నా రెండో స్థానం కోసం బిజెపి శ్రేణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేల ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసం తాము ఆశలు పెట్టుకున్న జనసేన ఓట్లలో అధిక శాతం గాజు గ్లాసు గుర్తుకు పడతాయేమో అనే ఆందోళన బీజేపీలో నెలకొంది . మరోవైపు తిరుపతిలో తమను పోటీ చేయనివ్వకుండా పొత్తులో భాగంగా ఒత్తిడి చేసి తమ అభ్యర్థిని నిలుపుకొన్న బిజెపి మూలంగానే జనసేన గుర్టైన గాజు గ్లాసు చేజారి మరొకరికి పోయిందని పోటీ చేసి ఉంటే తమ గుర్తు తమకి నిలబడి ఉండేదని జనసేన కార్యకర్తలు పలువురు బిజెపి పై అసహనం వ్యక్తం చేస్తుండటం చూస్తే బిజెపికి జనసేన వలన వస్తాయనుకొన్న ఓట్లకి తీవ్రంగా గండి పడిందని చెప్పొచ్చు.
Also Read : బీజేపీ కొంప ముంచనున్న గ్లాస్..!