iDreamPost
android-app
ios-app

తిరుపతి ఉప ఎన్నిక.. టీడీపీకి పెద్ద చిక్కొచ్చిపడిందే..!

తిరుపతి ఉప ఎన్నిక.. టీడీపీకి పెద్ద చిక్కొచ్చిపడిందే..!

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఏం చెప్పి ఓటు అడుగుదాం..? ఇదీ తెలుగుదేశం పార్టీ నేతల మొదళ్లను తొలస్తున్న ప్రశ్న. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల కోసం నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న టీడీపీ నేతలు.. తమ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలో తెలియక తికమకపడుతున్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు ఏ అవకాశం దొరకడం లేదు, ఎన్నికల హామీలపై ప్రశ్నిద్దామంటే.. వైఎస్‌ జగన్‌ ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. మరి ఇక ఏం చెప్పాలి..? వైసీపీకి కాకుండా.. టీడీపీకి ఓటు వేయాలని ఓటర్లను ఎలా కోరాలి..? ఇప్పుడు ఈ అంశంపైనే టీడీపీ నేతలు మల్లగుల్లాలుపడుతున్నారు.

వైసీపీ నేతలు అక్రమాలు చేస్తున్నారు.. వైఎస్‌ జగన్‌ అరాచకంగా పాలిస్తున్నారు.. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.. పథకాలు కట్‌ చేస్తామని ఓటర్లను బెదిరిస్తున్నారు.. ఈ తరహా ఆరోపణలు, విమర్శలు అన్నీ కూడా ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ నేతలు చేశారు. అయితే తమ మాటలకు ప్రజలు ఎంత విలువ ఇచ్చారో ఫలితాల తర్వాత వారికి అర్థమైంది. పసలేని విమర్శలు, అర్థరహితమైన ఆరోపణలతో పని కాదని తేలిపోయింది. ఇవి కాకుండా.. ఇక ఏం చేయాలి..? ప్రజలకు ఏం చెప్పాలి..? ప్రచారంలో ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో తెలియక.. టీడీపీ నేతలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాడిన పాత పాటలనే మళ్లీ పాడుతున్నారు. వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలంటే.. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని యనమ రామకృష్ణుడు పిలుపునివ్వడం.. ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచార అంశాలపై ఎంతటి డైలమాలో ఉన్నారో అర్థమవుతోంది.

ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాలో అర్థం కాక తలలుపట్టుకుంటున్న టీడీపీ నేతలకు.. ఆ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మీ తీరు మరింత ఆందోళనకు గురి చేస్తోంది.  పనబాక లక్ష్మీ ఎన్నికల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొనడం లేదని నేతలు అధినేత చంద్రబాబుకు చెప్పుకొస్తున్నారు. అభ్యర్థే ఇలా ఉంటే.. కార్యకర్తల్లో జోష్‌ నింపడం కష్టమని వాపోతున్నారు. మరో వైపు టీడీపీలోని పరిణామాలను బీజేపీ నిశితంగా గమనిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యర్థి టీడీపీనే. గెలుపుపై మేకపోతు గాంభీర్యంతో ఉన్న బీజేపీ నేతలు.. తమ అసలు లక్ష్యం ఏమిటో టీడీపీపై విమర్శలు చేయడం ద్వారా చెప్పకనే చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానం కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. టీడీపీని మూడో స్థానంలోకి నెట్టివేస్తే.. రాష్ట్రంలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయమని, ప్రతిపక్ష స్థానం తమదేననే సందేశం తిరుపతి ఉప ఎన్నిక ద్వారా చాటి చెప్పాలని బీజేపీ భావిస్తోంది.

Also Read : తిరుపతి అభ్యర్థిని తేల్చని బీజేపీ, ఆశావాహుల ఎదురుచూపులు..