ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అటు గెలవలేక ఇటు ఓటమిని ఒప్పుకోలేక, పోలింగ్ అయిపోయిన తర్వాత వాటిని రద్దు చేయాలని కోరడం ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్ గా మారింది. తిరుపతి ఉప ఎన్నికలను రద్దు చేయాలని ఇటీవల బీజేపీ అభ్యర్థి రత్నప్రభ హైకోర్టును ఆశ్రయించగా, ఇప్పుడు తాజాగా ఆ ఖాతాలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి సైతం చేరారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో తిరుపతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో భారీగా అవకతవకలు జరిగాయని, వెంటనే ఆయా శాసనసభ నియోజకవర్గం పరిధిలో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని పనబాక లక్ష్మి హైకోర్టుకు వెళ్లారు.
తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో అవకతవకలు జరిగి ఉంటే కేవలం తిరుపతి శాసనసభ నియోజకవర్గం పరిధిలోని జరిగాయి అని చెప్పడం వెనుక పనబాక లక్ష్మి చూపిస్తున్న కొన్ని విషయాలు విచిత్రంగా ఉన్నాయి. భారీగా దొంగ ఓట్లు నమోదు అయితే, వారిలో ఎవరినైనా పోలీసులకు పట్టించారు అన్నది ప్రధాన ప్రశ్న. కొన్ని చోట్ల దొంగ ఓటర్లుగా దొరికిపోయిన వ్యక్తులు సైతం తాము టిడిపి అభ్యర్థి గురించి వచ్చామని చెప్పారు. గూడూరు నియోజకవర్గంలో కొంతమంది మహిళలు దొంగ ఓటర్లుగా పట్టుబడి, తాము టిడిపి అభ్యర్థి కోసం వచ్చామని బహిరంగంగా చెప్పారు. మరి దీనికి పనబాక లక్ష్మి ఏ విధంగా సమాధానం చెబుతారు.
తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన రోజు కొందరు బిజెపి టిడిపి నాయకులు అనవసర హంగామా సృష్టించారు. లైన్లో ఉన్న వారిని బయటికి తీసుకు వచ్చి దొంగ ఓటర్లుగా చూపించే ప్రయత్నం చేశారు. మరి అలాంటప్పుడు వారి మీద పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు. ఎన్నికల పరిశీలకులుగా ఉన్నవారు వద్ద ఎలాంటి ఆధారాలు చూపించక పోవడం వెనుక బీజేపీ టీడీపీ నాయకుల వ్యూహం ఏమిటి.? దొంగ ఓటర్ ఐడి లు భారీగా తయారు చేశారు అని ఆరోపించడం వెనుక ఉన్న ఆధారాలను ఇప్పటి వరకు బయటకు పోవడం వెనుక అసలు కారణం ఏమిటి? అన్న కీలక విషయాలను గమనించాల్సి ఉంది.
Also Read : తెలుగు రాష్ట్రాలలోనూ అదే కారణమా..?
ప్రస్తుతం పనబాక లక్ష్మీ తిరుపతి శాసనసభ నియోజకవర్గం పరిధిలోని అవకతవకలు జరిగాయని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి లోకసభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుపతిలోనే ఎక్కువ మీడియా బలం అధికం. ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని మీడియా రాష్ట్రవ్యాప్త వార్తలు చేస్తుంది. మరి అలాంటి సమయంలో కేవలం తిరుపతి నగరంలోని అవకతవకలు బయట పడ్డాయి అని చెప్పడం వెనుక ఉన్న వ్యూహం అర్థం చేసుకోవాలి. ఎలాగో తిరుపతి ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని భావించిన టిడిపి, బిజెపిలు ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయి అని అధికార పార్టీ మీద నెపం నెట్టేసి బయట పడాలని భావించడమే దీని వెనుక ఉన్న అసలు మతలబు. అధికార పార్టీ మీద బురద జల్లి ఎన్నికల్లో ఆ పార్టీ అవకతవకలు చేసిన తర్వాతనే గెలిచింది అని మీడియా ముఖంగా ప్రచారం చేయడంలో భాగంగానే తిరుపతి లాంటి నగరంలో అవకతవకలు నాటకాన్ని రక్తి కట్టించారు.
ఇప్పుడు ఏకంగా తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయాలని బిజెపి అభ్యర్థి రత్నప్రభ, ఇటు టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి కోరడం వెనుక కూడా అదే వ్యూహం ఉంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన అప్పుడు దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఎన్నికల పరిశీలకులకు ఇచ్చి, దానిద్వారా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాల్సిన అభ్యర్థులు ఇప్పుడు ఏకంగా ఎన్నికల రద్దు చేయాలని హైకోర్టు వెళ్లడం వెనుక ఆ పార్టీల అంతర్గత విషయాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రతి ఉప ఎన్నికకు ఏదో ఒక ఆరోపణలు చేసి పైకోర్టుకు వెళ్తే ప్రతి ఎన్నికను కోర్టు రద్దు చేయాలని ఆదేశిస్తే అది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారిన అవకాశం లేకపోలేదు. అయితే ప్రభుత్వం, ఇద్దరు అభ్యర్థుల వాదనలు హైకోర్టు ఎలా ఉంటాయి..? కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తూ ఉంది అన్నది వేచి చూడాలి.
Also Read : జగన్ మాట నిజమైన వేళ.. ఏపీలో కరోనా వ్యాప్తికి బాధ్యులు ఎవరు..?