iDreamPost
android-app
ios-app

తిరుపతి ఉప ఎన్నిక – ఫలితం మీద బెట్టింగ్ జోరు

  • Published Apr 14, 2021 | 1:51 PM Updated Updated Apr 14, 2021 | 1:51 PM
తిరుపతి ఉప ఎన్నిక – ఫలితం మీద బెట్టింగ్ జోరు

తిరుపతిలో ఎన్నికల వేడి రాజుకుంది. పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కోవిడ్ కారణంగా సభను వాయిదా వేసుకోగా ఎన్నికల ఇన్ఛార్జులుగా ఉన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రచార బాధ్యతను భుజానకెత్తుకున్నారు. గురుమూర్తి గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అదే సమయంలో టీడీపీ అధినేత తిరుపతిలో మకాం వేశారు. ప్రచారంలో ఆయన ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థికి మద్ధతుగా జాతీయ అధ్యక్షుడు కూడా రంగంలో దిగారు. జేపీ నడ్డా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని భావించిన పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టడంతో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది.

ఈ తరుణంలో పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలపై బెట్టింగు రాయుళ్లు రంగంలోకి వచ్చేశారు. తిరుపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని భావిస్తున్న వారంతా మెజార్టీ ఓట్లపై పందాలు ప్రారంభించారు. గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కన్నా ఎంత ఎక్కువ వస్తుందనే దానిపై ఎక్కువగా పందాలు సాగుతుండడం విశేషం

2019 ఎన్నికల్లో 79.76 శాతం ఓట్లు పోలయ్యాయి. దాంతో అప్పట్లో 2,28,376 ఓట్ల ఆధిక్యం వైఎస్సార్సీపీకి దక్కింది. అయితే ఈసారి ఓట్ల శాతం బాగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా పోటీ ఏకపక్షంగా మారడంతో అత్యధికులు ఓటింగ్ కి దూరం అవుతారని అంచనా వేస్తున్నారు. దాంతో పోలయ్యే ఓట్లలో 10 నుంచి 15 శాతం తగ్గుదల ఉండవచ్చని అంచనాలున్నాయి.

సుమారుగా 60 శాతం ఓట్లు పోలయితే 9 లక్షల వరకూ ఓట్లు పోలవుతాయి. దాంతో అధికారపార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను బట్టి కనీసంగా 5లక్షల ఓట్లు దక్కినా టీడీపీకి గతంలో వచ్చిన 4.94 లక్షల ఓట్లలో సగం వరకూ పరిమితమయ్యే ప్రమాదం ఉందని అంచనాలు వేస్తున్నారు. ఒకవేళ టీడీపీ 3లక్షల మార్క్ కి చేరినా బీజేపీ కి గతంలో కేవలం 16వేల ఓట్లు మాత్రమే రాగా ఈసారి కనీసంగా 40వేలకు చేరువకావచ్చని లెక్కలేస్తున్న తరుణంలో వైస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి మెజార్టీ ఆసక్తిగా మారుతోంది.

ప్రస్తుతం బెట్టింగ్ బ్యాచ్ అంతా మెజార్టీ 3 లక్షలు దాటుతుందనే విషయంలోనే ఎక్కుగా పందాలకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ పోలింగ్ శాతం పెరిగితే మెజార్టీ 3లక్షలు సునాయాసంగా దాటిపోతుందని చెబుతున్నారు. అది 4లక్షలకు చేరుతుందనే అభిప్రాయం వైఎస్సార్సీపీ అభిమానుల్లో వినిపిస్తుండగా, టీడీపీ కూడా పుంజుకుందని ఆపార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి. దాంతో ఈ విషయంలో బెట్టింగుల జోరు పెరుగుతోంది. కేవలం తిరుపతిలోనే కాకుండా గోదావరి జిల్లాల్లో కూడా ఈ ఉప ఎన్నికలపై బెట్టింగులు సాగుతుండడం విశేషం. వాస్తవానికి ఐపీఎల్ సీజన్ లేకపోతే ఈ పందెం రాయుళ్లు మరింత రెచ్చిపోయే వారని కొందరి అభిప్రాయం.

Also Read : తుది అంకంలో బీజేపీ దిగాలు