Idream media
Idream media
తెలుగు రాష్ట్రాలో దాదాపు నెల రోజుల పాటు రాజకీయ వేడి పుట్టించిన తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఏడు గంటలకు పూర్తయింది. చివరి గంటలో కోవిడ్ బాధితులకు ఓట్లు వేసే అవకాశం కల్పించారు. ఇటు తిరుపతిలోనూ, అటు నాగార్జున సాగర్‌లోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
తిరుపతిలో 15 శాతం తక్కువ..
గత ఎన్నికలతో పోల్చుకుంటే తిరుపతిలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. 2019 సాధారణ ఎన్నికల్లో తిరుపతిలో 79.76 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 64.29 శాతం నమోదైంది. గతం కన్నా 15.47 శాతం తక్కువ పోలింగ్ జరిగింది. కోవిడ్ భయంతోపాటు ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం పోలింగ్ తగ్గేందుకు కారణాలుగా నిలిచాయి. లోక్‌సభ పరిధిలో మొత్తం 17,10,699 మంది ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికలో 10,94,022 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థులతో సహా 28 మంది బరిలో నిలిచారు.
సాగర్‌లో 2 శాతం ఎక్కువ..
హోరాహోరీగా సాగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో ఓటర్లు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 86.62 శాతం మేర పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి ఆ మొత్తం 88 శాతానికి పెరగడం ఈ ఎన్నికను అన్ని పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో తెలుపుతోంది. సాగర్‌లో 2,20,300 మంది ఓటర్లు ఉండగా.. 1,93,864 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు మొత్తం 41 మంది పోటీలో ఉన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు తిరుపతి, సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 2వ తేదీన వెల్లడికానున్నాయి.
Also Read : రీపోలింగ్.. టీడీపీ, బీజేపీలకు మైండ్ బ్లాక్