iDreamPost
iDreamPost
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ కు ఆ పదవి మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోనుంది. మూడు నెలల క్రితమే సీఎం పదవి చేపట్టిన ఆయన మరో రెండు నెలల్లోనే దిగిపోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఎమ్మెల్యే కాకపోవడమే దీనికి కారణం. అధికార బీజేపీలో తలెత్తిన అంతర్గత విభేదాలు, అసంతృప్తి కారణంగా అనూహ్య పరిస్థితుల్లో సీఎం అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో చట్టసభకు ఎన్నికయ్యే అవకాశం లేకపోవడంతో.. సీఎం పదవిని వదులుకోవాల్సి వస్తుంది. దాంతో ఆ రాష్ట్రం ఐదేళ్ల కాలంలో ముచ్చటగా మూడో ముఖ్యమంత్రిని చూడబోతోంది.
త్రివేంద్ర సింగ్ స్థానంలో తీరథ్
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 స్థానాలున్న అసెంబ్లీలో 56 కైవసం చేసుకొని త్రివేంద్ర సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరో ఏడాదిలో ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో సీఎం త్రివేంద్ర సింగుపై పార్టీలోకి తీవ్ర అసంతృప్తి తలెత్తింది. పార్టీ నాయకులతో పాటు ఎమ్మెల్యేలు ఆయన తీరుపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు మొదలుపెట్టారు. సీఎం తమను పట్టించుకోవడం లేదని, తమ నియోజకవర్గాల అవసరాలు తీర్చడంలేదన్న ఆరోపణలు పెరుగాయి. మరోవైపు అవినీతి ఆరోపణలు, వివాదాస్పద చార్ ధామ్ దేవస్థానాల యాజమాన్యాల నియంత్రణ బిల్లు, గైర్ సైన్ కమిషనరేట్ బిల్లులు.. ప్రజల్లో త్రివేంద్రసింగ్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. ఈ ఇబ్బందులతో పాటు ఏడాదిలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న బీజేపీ అధిష్టానం త్రివేంద్ర సింగును పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో ఘర్వాల్ ఎంపీ అయిన తీరథ్ సింగును సీఎం పదవిలో కూర్చోబెట్టింది.
ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదు
అసెంబ్లీ సభ్యుడు కాకుండానే తీరథ్ సీఎం అయ్యారు. ఇలాంటి సందర్భాల్లో పదవి చేపట్టిన వ్యక్తి ఆరు నెలల్లోపు సంబంధిత చట్టసభలకు తప్పనిసరిగా ఎన్నికవ్వాల్సి ఉంటుందని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. లేనిపక్షంలో పదవి పోతుంది. ప్రస్తుతం తీరథ్ సింగ్ అదే సంకట స్థితి ఎదుర్కొంటున్నారు. సెపెంబర్ 9 నాటికి ఆయన సీఎం పదవికి ఆరు నెలలు పూర్తి అవుతాయి. అంటే మరో రెండున్నర నెలల గడువే ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు 9 నెలల గడువే ఉంది. ప్రజాప్రతినిధ్య చట్టం సెక్షన్ 151 ప్రకారం.. ఏడాదిలోపు ఎన్నికలు ఉన్న చోట్ల ఉప ఎన్నికలు నిర్వహిండానికి వీల్లేదు. ఆ ప్రకారం తీరథ్ సింగ్ సెప్టెంబర్ 9 లోపు అసెంబ్లీకి ఎన్నికయ్యే అవకాశం లేనట్లే. దాంతో నిబంధనల ప్రకారం సెప్టెంబరులో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయక తప్పదు. ఆయన స్థానంలో మూడో సీఎం కుర్చీ ఎక్కుతారు. పదవిలో కుదురుకోక ముందే.. ఆరు నెలల్లోపే ఆయన అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Also Read : స్టాలిన్ సంచలన నిర్ణయం – రఘురామ రాజన్ ,అరవింద్ సుబ్రమణ్యన్ లతో ఆర్ధిక సలహా మండలి ఏర్పాటు