iDreamPost
android-app
ios-app

తిరుమలలో చిరుత కలకలం.. మూడేళ్ల బాలుడిపై దాడి! TTD కీలక నిర్ణయం

  • Author Soma Sekhar Published - 10:50 AM, Fri - 23 June 23
  • Author Soma Sekhar Published - 10:50 AM, Fri - 23 June 23
తిరుమలలో చిరుత కలకలం.. మూడేళ్ల బాలుడిపై దాడి! TTD కీలక నిర్ణయం

తిరుమలలో చిరుత పులి కలకలం సృష్టించింది. అలిపిరి నడక మార్గంలో గురువారం చిరుత పులి సంచరించింది. ఏడవ మైలు దగ్గర మూడేళ్ల బాలుడిపై దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచింది. బాలుడిని గాయపరిచి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్తుండగా.. గమనించిన బాలుడి తాత, కుటుంబ సభ్యులు, భక్తులు కేకలు వేస్తూ.. చిరుతను వెంబడించారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న తిరుపతి ఎస్సై ఘటనా స్థలానికి పరుగులు తీశాడు. అందరి అరుపులకు భయపడిన చిరుత బాలుడిని 150 మీటర్ల దూరంలో పిల్లడిని వదిలేసి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రిలో చేర్పించారు.

తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో చిరుత పులి కలకలం సృష్టించింది. గురువారం 7వ మైలు దగ్గర మూడు సంవత్సరాల బాలుడు కౌశిక్ పై దాడి చేసింది. చిరుత పులి దాడిలో గాయపడ్డ బాలుడిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందున్న కౌశిక్ ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగితెలుసుకున్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న కౌశిక్ పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దయ వల్లనే బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడని ఆయన అన్నారు.

ఇక ఈ దాడిని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. అలిపిరి మెట్ల మార్గంలో నడకదారి భక్తుల భద్రత దృష్ట్యా.. శ్రీవారి మెట్ల మార్గం తరహాలో రాత్రి 6 గంటల తర్వాత నడక అనుమతిని నిలిపివేసే విధంగా ఆలోచన చేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఇక మెట్ల మార్గంలో జంతువులు తిరిగే ప్రదేశాల్లో ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. చిన్నారి కౌశిక్ ఆరోగ్యం కుదుట పడ్డాక మేమే స్వయంగా అతడికి దర్శనం కల్పించి స్వగ్రామంలో దించుతామన్నారు. కాగా నడకదారిలో వెళ్లే భక్తులు ఒక్కొక్కరిగా కాకుండా గుంపులు గుంపులుగా వెళ్లాలని ఆయన సూచించారు. చిరుత సంచారంతో నడకదారి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి