Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల సమానాభివృద్ధికి వైసీపీ సర్కార్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ఏర్పాటు మరింత ఆలస్యం కాబోతోంది. ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి శాసన పరమైన అన్ని చర్యలను జగన్ సర్కార్ చేపట్టినా.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు, సుప్రింకోర్టులలో దాఖలైన పిటిషన్లను అన్నింటినీ కలిపి రోజు వారీ విచారణ జరపాలని సుప్రిం కోర్టు ఏపీ హైకోర్టును ఆదేశించింది.
ఈ నేపథ్యంలో గత ఏడాది అర్థభాగంలో ఏపీ హైకోర్టులో విచారణ మొదలైంది. నిర్ణీత వ్యవధిలో విచారణ పూర్తి చేయాలని సుప్రిం దిశానిర్ధేశం చేసినా.. అందుకు కోవిడ్ రూపంలో అంతరాయం ఏర్పడింది. విచారణ సాగుతున్న సమయంలో.. ఈ పిటిషన్లను విచారిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. దీంతో నూతనంగా వచ్చిన చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఈ విచారణను మళ్లీ మొదటి నుంచి చేపట్టారు.
ఇప్పటికే ఈ పిటిషన్లను అంశాల వారీగా విభజించిన చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి.. విచారణను ప్రారంభించారు. అయితే విచారణకు మరోసారి కోవిడ్ రూపంలో ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం కోవిడ్ రెండో దశ వ్యాప్తి విస్తృతంగా ఉన్న తరుణంలో హైకోర్టు సహా ఇతర ప్రభుత్వ కార్యకలాపాలు నెమ్మదించాయి. వేసవి సెలవులు, కరోనా ఉధృతి నేపథ్యంలో మూడు రాజధానులపై దాఖలైన పిటిషన్ల రోజు వారీ విచారణను ఏపీ హైకోర్టు ఆగస్టుకు వాయిదా వేసింది.
ఆగస్టు 23వ తేదీ తర్వాత రోజు వారీ విచారణ తిరిగి ప్రారంభమవుతుందని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. అంటే దాదాపు మరో నాలుగు నెలల వరకూ ఈ అంశంపై ఎలాంటి కదలిక ఉండబోదు. ఆగస్టు 23వ తర్వాత విచారణ తిరిగి ప్రారంభమై.. పూర్తయ్యేందుకు కనీసం రెండు, మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో మూడు రాజధానుల ఏర్పాటు కార్యరూపం దాల్చాలంటే 2022 ప్రారంభం వరకూ వేచి చూడాల్సిందే.
Also Read : నందిగ్రామ్ ఆర్వోకు బెదిరింపులు?