iDreamPost
android-app
ios-app

పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టు సంచలన ఆదేశాలు..!

పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టు సంచలన ఆదేశాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏప్రిల్‌ మొదటి వారంలో పరిషత్‌ ఎన్నికలు జరగ్గా.. సుప్రిం కోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికల కోడ్‌ అమలు చేయలేదంటూ టీడీపీ, జనసేన పార్టీలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి.

అయితే అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడం, పోలింగ్‌కు ఏర్పాట్లు చేయడంతో పోలింగ్‌ నిర్వహణకు అనుమతించిన హైకోర్టు.. తుది తీర్పు వెలువడే వరకూ ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్‌ ముగిసిన తర్వాత పలుమార్లు ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెలువరించింది.

పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. సుప్రిం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు జరగలేదంటూ ఆక్షేపిస్తూ పోలింగ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసి జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆది నుంచి ఓ ప్రహాసనంగా సాగింది. 2020 మార్చిలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తొలుత నోటిఫికేషన్‌ జారీ చేశారు. నామినేషన్ల దాఖలు, పరిశీలన, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత కరోనాను కారణంగా చూపుతూ అర్థంతరంగా వాయిదా వేశారు.

ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆగిన పరిషత్‌ ఎన్నికలను కాకుండా.. పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించారు. పరిషత్‌ ఎన్నికలను మాత్రం పక్కన పెట్టారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ముప్పు, వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో ఎన్నికలు వద్దన్నా.. వినని నిమ్మగడ్డ ఏకక్షపంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఇందు కోసం ఆయన కోర్టులకు కూడా వెళ్లారు.

Also Read : జగన్ వ్య‌క్తిత్వానికి ష‌రీఫ్ మాట‌లే నిద‌ర్శ‌నం

ఇంత పట్టుబట్టిన నిమ్మగడ్డ.. ఆఖరుకు పరిషత్‌ ఎన్నికలను మాత్రం నిర్వహించకుండా చేతులెత్తాశారు. కొత్త కమిషనర్‌దే ఈ బాధ్యత అంటూ మార్చి 31వ తేదీన ఉద్యోగ విమరణ చేశారు. కేవలం ఆరు రోజుల్లో ముగిసే పరిషత్‌ ఎన్నికలను నిర్వహిస్తే.. ఇకపై యంత్రంగం అంతా వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందన్న రాష్ట్ర ప్రభుత్వ వినతులను కూడా నిమ్మగడ్డ పెడచెవిన పెట్టారు.

నూతన ఎస్‌ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిషత్‌ ఎన్నికలు ఆగిన చోట నుంచి ప్రారంభించేందుకు ఏకగ్రీవం మినహా మిగతా 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ టీడీపీ ప్రకటించింది. ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించిన టీడీపీ.. ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదంటూ కోర్టులకు వెళ్లడం ఆ పార్టీ ఉద్దేశాన్ని తెలియజేస్తోంది. నిమ్మగడ్డ ఉన్నన్ని రోజులు.. స్థానిక సంస్థల ఎన్నిలను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన టీడీపీ.. చివరకు పరిషత్‌ ఎన్నికల్లో పాల్గొనకపోయినా.. వాటిని అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేయడం గమనార్హం.

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు వ్యక్తిగత లక్ష్యాలతో పని చేస్తే.. ఫలితం ఎలా ఉంటుందో కరోనా చేస్తున్న విధ్వసం ద్వారా అర్థమవుతోంది. సెకండ్‌ వేవ్‌పై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసినా.. వినకుండా ఎన్నికలను నిర్వహించిన నిమ్మగడ్డ, ఆయనకు వంతపాడిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు కరోనా ఉధృతికి కారకులయ్యాయి.

పరిషత్‌ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం డివిజనల్‌ బెంచ్‌లో లేదా సుప్రిం కోర్టులోనూ సవాల్‌ చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ అంశంపై తుది నిర్ణయానికి రాలేం. ఇది కొత్త నోటిఫికేషన్‌ కాదని, వాయిదా పడిన ఎన్నికలనే నిర్వహిస్తున్నామనే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వాదనకు పై కోర్టులో ఎలాంటి మద్ధతు లభిస్తుందో వేచి చూడాలి.

Also Read : మ‌రోసారి “ఆంధ్రుల హ‌క్కు” ను చాటిన జ‌గ‌న్