iDreamPost
iDreamPost
హడావిడి చేయకుండా మీడియాని పదే పదే రమ్మని చెప్పకుండా షూటింగ్ లో ఉన్న తన సినిమాకు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో రాజమౌళికి తెలిసినంతగా బాలీవుడ్ తో సహా ఇంకెవరికి అంత పట్టు లేదన్నది వాస్తవం. ఎప్పటికప్పుడు హైప్ ని బాలన్స్ చేస్తూ అంతకంతా అంచనాలు పెంచుకుంటూ పోయి అభిమానులు పదే పదే తన సినిమా గురించి తలుచుకునేలా చేయడం ఒక ఆర్ట్. అందులో జక్కన్న ఎంత నిష్ణాతుడో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరుగుతోంది. అసలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ అని ప్రకటించినప్పటి నుంచే దీని గురించి ఏ స్థాయిలో చర్చ జరుగుతోందో చూస్తున్నాం.
తాజాగా కొందరు ఎంపిక చేసిన అభిమానులకు ప్రత్యక్షంగా సెట్ కు వచ్చి తమ ఆరాధ్య హీరోలను కలిసి షూటింగ్ చూసే అవకాశం కలిగించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి కరోనా రాకపోయి ఉంటే ఆర్ఆర్ఆర్ నిన్న విడుదల కావాలి. ఈ విషయాన్ని ఒక ఫ్యాన్ ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ థియేటర్ అంతా చీకటిగా ఉందని, స్క్రీన్ మీద హీరోలు కనిపించడం లేదని కొంత ఎమోషనల్ టచ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి ఎస్ఎస్ కార్తికేయ సమాధానం ఇస్తూ అయితే కొందరికి నేరుగా చూసే ఇస్తామని వివరాలు డిఎం చేయమని చెప్పడంతో ఇది కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యింది.
సంక్రాంతి సినిమాలు తప్ప ఇంకే చర్చ జరగని తరుణంలో ఇలా ఆర్ఆర్ఆర్ ట్రెండింగ్ లో రావడం అంటే మాటలా. అసలే ఎలాంటి అప్ డేట్ లేదని ఇద్దరు హీరోల అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్న తరుణంలో ఇలా వాళ్ళను సంతృప్తి పరిచేలా ఇలాంటివి చేయడం నిజంగా ఊహకందనివే. నాన్న రాజమౌళి అనుమతి లేకుండా కార్తికేయ నేరుగా ఇలా ఆహ్వానించే అవకాశం లేదు. సో వెనక జక్కన్న ఉన్నాడన్నది వాస్తవం. జనవరి 26న ఓ టీజర్ రావొచ్చనే టాక్ ఇప్పటికే ఉంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చిన ఆర్ఆర్ఆర్ విడుదల ఎప్పుడనేది మాత్రం ఇప్పట్లో ఎవరూ చెప్పలేరు రాజమౌళితో సహా.