గాలి జనార్థన్‌ ఇంట్లో చోరీ.. ఏం ఎత్తుకెళ్లారంటే..?

మైనింగ్ కింగ్, వ్యాపార వేత్త, ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. ఆయన ఇంటి వద్ద బందో బస్తు ఉన్నా ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సీసీటీవీ కళ్లుగప్పి మరీ దొంగతనానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఇంట్లో అందులోనూ పేరు మోసిన వ్యాపార వేత్త ఇంట్లో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన ఇంట్లో దొంగతనం జరిగిందన్న విషయం బయటకు వచ్చింది. ఇంతకు ఆయన ఇంట్లో ఏం దోచుకెళ్లారంటే సిక్స్ ఎంఎం పిస్తోలు. ఎమ్మెల్యే ఇంటి వద్ద పహారా కాస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ వద్ద లైసెన్స్ కలిగిన పిస్తోలు పోయింది. గ్రహించిన సిబ్బంది వెంటనే బళ్లారి ఎస్పీకిి ఫిర్యాదు చేశారు.

బెంగళూరు నగరంలోని హవ్వంబావి ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డి ఇంట్లో ఈ చోరీ చోటుచేసుకుంది. ఈ నివాసానికి ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కాపలాదారులుగా ఉంటున్నారు. ఆ ఇద్దరు ఒకరు.. తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ పిస్తోల్‌ను అక్కడే పెట్టి బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూడగా.. అది కనిపించలేదు. అక్కడ ఉన్న వారందరినీ అడగ్గా.. తీయలేదు అన్న సమాధానంతో వెంటనే ఆ సెక్యూరిటీ గార్డు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక టీం.. గాలి జనార్థన్ రెడ్డి ఇంటి పరిసరాలు, మెయిన్ గేట్ దగ్గర గాలించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పరిశీలించారు.

ఆ ఫుటేజ్‌లో సెక్యూరిటీ గార్డు పెట్టిన స్థలం నుండి గన్నును ఎవరో ఓ వ్యక్తి తీసుకెళ్లినట్లు కనిపిస్తోంది.  ఆ పిస్తోల్‌ను ఉద్దేశపూర్వకంగా తీశారా.. అది ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది అని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఆ పిస్తోల్ కోసం గాలిస్తున్నారు. గత ఏడాది బీజెపీ నుండి బయటకు వచ్చేసిన గాలి జనార్థన్ రెడ్డి.. కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ (కేఆర్‌పీపీ) స్థాపించిన సంగతి విదితమే. ఈ ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తరుఫున కోప్పళ జిల్లాలోని గంగావతి నుండి పోటీ చేసి గెలుపొందారు.

Show comments