iDreamPost
iDreamPost
లాక్ డౌన్ ఇంకా పూర్తిగా ఎత్తివేయకపోయినా మెల్లగా ఒక్కో రంగానికి సంబంధించి ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడం షురూ చేశాయి. ముందుగా ప్రజా రవాణాను మొదలుపెట్టబోతున్నారు. కొన్ని నిబంధనలు ఉన్నాయి కానీ మొత్తానికైతే తొలి అడుగు పడబోతోంది. ఇక థియేటర్ల విషయానికి వస్తే ఐడ్రీం చాలా వారాల క్రితమే చెప్పినట్టు సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఇచ్చి టికెట్ల అమ్మకాలు చేసే దిశగా ఇప్పటికే యాజమాన్యాలు చర్యలు చేపడుతున్నాయి. హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ కాంప్లెక్స్ నుంచి దీనికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిసింది.
అయితే కొత్త సినిమాలు విడుదలకు ఇంకా సిద్ధంగా లేవు కాబట్టి కొన్ని రోజులు పాతవాటితోనే నడిపి చూడబోతున్నారు. కేవలం మూడు షోలు మాత్రమే ప్రదర్శించేలా ప్రతి షోకు మధ్య గ్యాప్ 45 నిముషాలు ఉండేలా ప్లానింగ్ చేస్తున్నారు. ఇది కాకుండా హాల్ లోపలి వచ్చే ప్రతి కస్టమర్ చేతికి శానిటైజర్ చుక్కలు వేసేలా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయట. సుమారు వందకు థియేటర్ ఓనర్ల వీడియో కాన్ఫరెన్స్ లో దీని గురించే చర్చించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇదంతా వర్కవుట్ అయ్యే పనేనా అనే అనుమానాలు లేకపోలేదు. అయితే ఇక్కడ మరొక కోణం గమనించాలి. ఖచ్చితంగా నిత్యావసరాలు కాని మద్యం, మాంసాహారం తదితర వాటి కోసం వినియోగదారులు రాజీ పడటం లేదు.
ఎంత రష్ ఉన్నా సరే లెక్కచేయకుండా కొంటున్నారు. చాలా చోట్ల రద్దీ ఉన్నా పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుని హాళ్ళను నడిపే తమకు అనుమతి ఇవ్వాలని వాళ్ళు గవర్నమెంట్ ని కోరబోతున్నట్టు వినికిడి. ఇటీవల జరిగిన సమావేశంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఒక నెల రోజుల్లో అంతా సానుకూలంగా ఉంటుందనేలా సంకేతాలు ఇవ్వడంతో ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే జులైలో కనీసం 3 కొత్త సినిమాలు రిలీజయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే రఫ్ గా డేట్స్ కూడా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు థియేటర్ ఓనర్ల ప్రతిపాదన, వినతికి ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయనే దాని మీద ఇదంతా ఆధారపడి ఉంది. అసలే రెండు నెలలుగా సినిమా హాల్ లో అడుగుపెట్టక మూవీ లవర్స్ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మరి ఈ ఫార్ములా ఎంతమేరకు ఫలిస్తుందో ప్రయోగాత్మకంగా అమలులోకి తెస్తే కానీ అర్థం కాదు.