iDreamPost
android-app
ios-app

సర్దార్జీలు,జాట్ ల తెలివితేటల మీద త్రిపుర ముఖ్యమంత్రి వివాదాస్పద వాఖ్యలు

సర్దార్జీలు,జాట్ ల తెలివితేటల మీద త్రిపుర ముఖ్యమంత్రి వివాదాస్పద వాఖ్యలు

ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి…సుదీర్ఘంగా 25 ఏళ్లపాటు త్రిపురను పరిపాలించిన లెఫ్ట్ ఫ్రంట్‌ను ఓడించి అధికారం చేపట్టిన బిజెపి నేత. కానీ తన నోటిని అదుపులోపెట్టుకోరు,ఎదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తుంటారు. దీంతో ఆయన ఎప్పుడు ఏమి మాట్లాడుతుంటాడో…అది ఎలాంటి వివాదానికి దారి తీస్తుందో అని సొంత పార్టీ నేతలే గుబులు చెందుతుంటారు.

ఆయనే త్రిపుర ముఖ్యమంత్రి,బిజెపి నేత విప్లవ్ దేవ్..అధికార హోదాలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఆయన పలు సందర్భాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది.2018లో విప్లవ్ దేవ్ మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, శాటిలైట్ టీవీలు ఉన్నాయని వ్యాఖ్యానించి అపకీర్తి మూటగట్టుకున్నాడు.ఇక గతేడాది భారత సంస్కృతిని, సంప్రదాయాల్ని దెబ్బతీయడానికి మొఘల్స్ కావాలనే తమ పర్షియన్ కళలను దేశంలో ప్రవేశపెట్టారని కామెంట్ చేశారు. మే డే రోజున ప్రభుత్వోద్యోగులకు సెలవు ఎందుకని ప్రశ్నించాడు.అలాగే చదువుకున్న యువతీ యువకులు ఆవుల్ని పెంచుకోవాలని,లేదంటే పాన్‌షాప్‌ పెట్టుకోవాలని పేర్కొని విమర్శల పాలయ్యాడు.

తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పంజాబీలు,జాట్లు శారీరకంగా చాలా బలంగా ఉంటారు,కానీ వాళ్లకు మెదళ్లు లేవు అంటూ సీఎం విప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.బెంగాల్ ప్రజలు తెలివైన వారు, తెలివితేటలలో వారితో పంజాబీలు,జాట్లు పోటీ పడలేరని వ్యాఖ్యానించాడు.ఇంకా సర్దార్‌లైన పంజాబీలను గెలవాలంటే శారీరకంగా సాధ్యం కాదు,కానీ ప్రేమతో వారిని గెలవగలమని ఆయన పేర్కొన్నాడు.అలాగే హర్యానాలో జాట్లు కూడా ఆరోగ్యంగా ఉంటారే తప్ప, వారికి బుర్ర తక్కువ అని తెలిపాడు.అందుకే బెంగాల్ ప్రజలు తెలివైన వారనే గుర్తింపు దేశమంతా ఉంది” అని విప్లవ్ దేవ్ వ్యాఖ్యానించి సంచలనం రేపాడు.

కాగా త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా మండిపడ్డాడు.సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటు అని,ఇది బిజెపి నేతల ఆలోచనల స్థాయిని సూచిస్తుందంటూ విప్లవ్ దేవ్ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు.ఆయన వ్యాఖ్యలపై హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ స్పందించాలని డిమాండ్ చేశారు.అయితే ఆయన తమ పార్టీ సీఎం కావడం వల్ల ఈ వ్యాఖ్యలపై ఖట్టర్‌ ఎలా స్పందిస్తారోనని రాజకీయ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి.