విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువు.. తప్ప తాగి స్కూల్లోనే పొర్లాడు

పిల్లల్ని తల్లిదండ్రులు కని పెంచినా.. వారికి విద్యా బుద్దులు నేర్పి, ప్రయోజకులను చేసేది మాత్రం గురువులే. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు పెద్దలు. విద్యార్థులు దారి తప్పితే.. వారిని సన్మార్గంలో నడిపించేది ఉపాధ్యాయులే. నయాన్నో, భయాన్నో విద్యార్థులను మందలిస్తూ.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. పెరిగి పెద్దయ్యి ప్రయోజకులుగా మారడంలో తల్లిదండ్రుల కష్టం ఎంతగా ఉంటుందో, గురువుల కృషి అంతే ఉంటుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో కచ్చితంగా ఇష్టమైన ఉపాధ్యాయుడు ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ పాఠాలు నేర్పాల్పిన గురువే..పిల్లల ముందు తప్పతాగి పడ్డాడు.

పిల్లలు మంచి పౌరులుగా తీర్చి దిద్దేందుకు కృషి చేయాల్సిన ప్రధానోపాధ్యాయుడు.. మద్యం తాగి పాఠశాలకు రావడమే కాదూ.. నడవలేని స్థితిలో స్కూల్ ఆవరణలోనే పడి దొర్లుతున్న దృశ్యం కనిపించింది. ఈ ఘటన ఒడిశాలోని కేంఝర్ జిల్లాలో చోటుచేసుకుంది. హరిచందన్ పూర్ సమితిలో ఉన్న గరదాహాబహాలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ప్రాధానోపాధ్యాయుడు వసంత ముండ ఇటీవల తప్పతాగి పాఠశాలకు వచ్చారు. ఈ పాఠశాలలో ఒకటి నుండి 5వ తరగతి వరకు మాత్రమే ఉండగా.. వసంత్‌తో పాటు మరో ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. పాఠశాలకు తాగి వచ్చిన వసంత్.. నడవ లేక.. స్కూల్ బయటే నేలపై పడి దొర్లడం ప్రారంభించారు. బడికి వస్తున్న విద్యార్థులు ఈ దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వచ్చి ఆయనకు సపర్యలు చేశారు. కొందరు.. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.

Show comments