Idream media
Idream media
కువైట్‌లో మన తెలుగు వాళ్లు లక్షల్లో ఉన్నారు. కరోనా దెబ్బకి వాళ్లంతా విలవిల్లాడుతున్నారు. కువైట్ మన దేశానికి విమానాలు నిలిపివేసింది. దాంతో మన వాళ్లకు ఇబ్బందులు మొదలయ్యాయి. అనేక పనుల మీద ఇండియా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్న వాళ్లు రద్దు చేసుకుంటున్నారు. ఒకవేళ వేరే దేశానికి వెళ్లి అక్కడి నుంచి ఇండియాకి వస్తే మళ్లీ తిరిగి రావడానికి ఎన్ని ఆంక్షలుంటాయో తెలియదు.
కువైట్‌లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లంతా ఎక్కువగా సామాన్యులే. ఒకవేళ ఇండియా వస్తే తిరిగి ఉద్యోగం ఉంటుందో ఉండదో అనే భయం. ఎందుకంటే కరోనా వ్యాప్తి ఎక్కువై కువైట్ కొంత కాలం నో ఎంట్రీ పెడుతుందేమోనని ఆందోళన.
కువైట్‌లో ఉన్నవాళ్లలో ఎక్కువ మందికి ఫ్యామిలీలు ఇండియాలోనే ఉన్నాయి. ఈ సమ్మర్‌లో పిల్లల పెళ్లిళ్లు పెట్టుకున్నారు. అవన్నీ వాయిదా అయినా వేయాలి. లేదంటే తాము లేకుండానే జరిపించాలి. అదే విధంగా పరీక్షలు అయిపోయిన తర్వాత పిల్లలు అయినా కువైట్‌కి వెళ్లి అమ్మానాన్నలతో సెలవులు గడుపుతారు. లేదా అమ్మానాన్నకి వీలైతే వాళ్లే కొద్ది రోజులు పిల్లలతో ఉంటారు. అవన్నీ ఈసారి ఆగిపోతున్నాయి.
ఇది కాకుండా తమ వాళ్లకి ఆరోగ్యాలు బాగలేకపోయినా, మృతి చెందినా కూడా కువైట్ నుంచి రాలేని స్థితి. గల్ఫ్ యుద్ధం తర్వాత కువైట్ వాసుల్ని ఇంతగా సంక్షోభానికి గురి చేసింది కరోనానే.