Idream media
Idream media
ఫిబ్రవరి 13, 1847న ఉత్తర భారతదేశంలోని అవధ్ సంస్థానానికి పదవ పాలకుడుగా పట్టాభిషేకం జరుపుకున్న వాజిద్ ఆలీ షా పదవ వార్షికోత్సవం జరుపుకోకుండానే తన పీఠం కోల్పోవాల్సి వస్తుందని ఊహించి ఉండడు. ఆనాటి ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ సామ్రాజ్య విస్తరణ కాంక్షకు అవధ్ సంస్థానం బలి అయిపోయింది.
ఈస్టిండియా కంపెనీ రాజ్యకాంక్ష..
వ్యాపారం కోసం 1600 సంవత్సరంలో ఏర్పడిన ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో మొదట్లో తమ గోడౌన్లకు కాపలా కోసం ఏర్పరచుకున్న తమ ప్రైవేటు సైన్యాన్ని ఆ తరువాత ఇక్కడ రాజ్యాల మధ్య జరిగే యుద్ధాల్లో అద్దెకిచ్చి డబ్బులు సంపాదించే స్థాయి నుంచి ప్లాసీ, బక్సర్ యుద్ధాల తర్వాత సామ్రాజ్య స్థాపన మీద కన్ను వేసింది. స్థానిక రాజ్యాలతో ఒప్పందాలు చేసుకోవడం, చిన్న రాజ్యాలను ఆక్రమించుకోవడం లాంటి చర్యలతో క్రమేపీ తమ రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఉన్న దశలో గవర్నర్ జనరల్ గా లార్డ్ డల్హౌసీ 1849లో భారత దేశానికి వచ్చాడు.
మగ వారసులు లేని సంస్థానాలు ఈస్టిండియా కంపెనీ స్వాధీనం అయ్యేలా రాజ్య సంక్రమణ సిద్ధాంతం (Doctrine of the Lapse) ప్రవేశపెట్టి తను పదవిలో ఉన్న ఆరు సంవత్సరాలలో ఝాన్సీతో సహా ఆరు సంస్థానాలను కంపెనీ పాలనలో కలిపేసుకున్నాడు. అప్పుడు డల్హౌసీ దృష్టి అవధ్ మీద పడింది.
ఔరంగజేబ్ తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడడంతో ఆనేక సామంతరాజ్యాలు స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. అలా అవధ్ 1819లో స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. అయితే అవధ్ పాలకులు తమ సైనిక అవసరాల కోసం ఈస్టిండియా కంపెనీతో చేసుకున్న ఒప్పందాల కారణంగా వారికి అధిక మొత్తంలో కప్పం చెల్లించి, తమ రాజ్యంలో కొంతభాగాన్ని సమర్పించుకోవలసి వచ్చింది.
వాజిద్ ఆలీ షా పాలకుడిగా బాధ్యతలు చేపట్టేనాటికి అవధ్ సంస్థానం బలహీనంగా ఉండేది. 1801లో ఈస్టిండియా కంపెనీతో అప్పటి అవధ్ పాలకులు చేసుకున్న ఒప్పందం ప్రకారం రాజ్యంలో చాలా భాగం కంపెనీ పరమైంది. ప్రతిఏటా అధిక మొత్తంలో కప్పం కూడా చెల్లించవలసి వచ్చింది. తూర్పు భాగంలో బెంగాల్ ప్రాంతంలో ఉన్న ఈస్టిండియా కంపెనీ సామ్రాజ్యానికి, పశ్చిమ, ఉత్తర భాగంలో ఉన్న మొఘల్ సామ్రాజ్యానికి మధ్య తమకు విధేయంగా ఉన్న రాజ్యం ఉంటే బాగుంటుందని భావించిన కంపెనీ అవధ్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోకుండా చాలా సంవత్సరాలు ఆగింది.
ఎట్టకేలకు 1856 ఫిబ్రవరి 11న మరో రెండు రోజుల్లో వాజిద్ ఆలీ షా తమ పట్టాభిషేకం పదవ వార్షికోత్సవం చేసుకుంటాడనగా అతని పరిపాలన సరిగా లేదన్న కారణం చూపించి అవధ్ సంస్థానాన్ని కంపెనీ కైవసం చేసుకుంది. కంపెనీ ప్రతినిధి చేతిలో అవధ్ పాలనను పెట్టి, సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయల పెన్షన్ ఇచ్చి, వాజిద్ ఆలీ షాని కలకత్తా సమీపంలో ఉన్న ప్రాంతానికి ప్రవాసం పంపింది.
కంపెనీ వారితో పోరాడే బలం లేనందున లండన్ వెళ్ళి అక్కడ బ్రిటిష్ రాణితో తన వాదం చెప్పి తన రాజ్యాన్ని తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని వాజిద్ ఆలీ షా అనుకున్నా, కలకత్తా ప్రయాణంలో అస్వస్థుడు కావడంతో, అక్కడ అతన్ని పరీక్షించిన అతని వ్యక్తిగత వైద్యులు ఇంగ్లాండుకి సుదీర్ఘ సముద్రయానం చేయలేడని చెప్పారు. అప్పుడు బ్రిటిష్ రాణిని కలిసి, వివరణ ఇచ్చుకునే బాధ్యత అతని తల్లి యాభై ఏళ్ల వయసున్న మాలికా కిష్వర్ తీసుకుంది.
Also Read : అప్పట్లో మహారాజుకే కార్ అమ్మలేదు,తెలుసా?
మొదటి సారి అంతఃపురం దాటిన రాణి
అంతకు ముందు ఎప్పుడూ తన అంతఃపురం దాటి బయటకు రాని మాలికా కిష్వర్ తన కుమారుడికోసం బ్రిటిష్ రాణిని కలిసి, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించడానికి తొమ్మిది మంది పరిచారికలు, 111 మంది సహాయకులు, అనేక మంది సైనికులతో ఒక ఓడలో బయలుదేరి ఈజిప్టులో సూయజ్ ఓడరేవు చేరుకున్నారు. అక్కడ నుంచి అలెగ్జాండ్రియా చేరుకుని, అక్కడ నుంచి స్టీమ్ బోటులో సౌతాంప్టన్ చేరుకోవాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
సూయజ్ రేవులో సామాన్లు దింపుతూ ఉండగా రాణిగారికి బహుమతిగా ఇవ్వడానికి తీసుకొచ్చిన యాభై వేల పౌండ్లు విలువ చేసే బంగారం, వజ్రాలు ఉన్న పెట్టె జారిపడి సముద్రంలో మునిగిపోయింది. సూయజ్ నుంచి అలెగ్జాండ్రియాకు, అక్కడ నుంచి బయలుదేరి ఆగస్టు 21న ఇంగ్లాండు లోని సౌతాంప్టన్ చేరుకున్నారు రాణిగారి బృందం. అక్కడ రాయల్ యార్క్ హోటల్ మొత్తం అద్దెకు తీసుకుని పదిరోజుల తర్వాత రైలు ద్వారా లండన్ చేరుకోవాలనుకున్నారు. రాణి గారిని ఇతర పురుషులు ఎవరూ చూడకుండా ఆమె తాము బుక్ చేసుకున్న బోగీలో ఎక్కేవరకూ స్టేషన్ లో ఎవరూ లేకుండా చూడాలన్న అభ్యర్థనను సౌతాంప్టన్ స్టేషన్ మాస్టర్ తిరస్కరించాడు. దాంతో ఆమె సహాయకులు ఆమెకు అటూఇటూ పరదాలు పట్టుకుని, రైలు ఎక్కించారు.
లండన్ చేరిన రాణిగారి బృందం మెరిల్ బోన్ రోడ్డులో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని బ్రిటిష్ రాణిగారి అపాయింట్ మెంట్ కోసం వేచి చూస్తూ పదకొండు నెలలు గడిపారు. ఈ మధ్యలో అవధ్ బృందం గురించి ప్రతిరోజూ ఇంగ్లాండు వార్తాపత్రికల్లో కథనాలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతూ వచ్చాయి. పర్దాలో ఉన్న రాణి, ఆమె బృందం, వారు వచ్చిన పని గురించి బ్రిటిష్ పౌరుల్లో ఆసక్తి బాగా పెరిగింది. చివరకు జులై 4,1857న ఇద్దరు రాణులు బుకింగ్ హామ్ కోటలో కలిశారు.
మామూలుగా అయితే విక్టోరియా రాణి ఏం చేసేదో కానీ, వారి సమావేశానికి రెండు నెలల ముందే ఉత్తర భారత దేశంలో సిపాయిల తిరుగుబాటు మొదలైంది. అవధ్ ప్రాంతంలో ఆ పోరాటానికి వాజిద్ ఆలీ షా భార్య బేగమ్ హజ్రత్ మహల్ నాయకత్వం వహించింది. దాంతో కలకత్తా సమీపంలో ఉన్న వాజిద్ ఆలీ షాని నిర్బంధం చేశారు బ్రిటిష్ వారు. మారిన పరిస్థితుల వల్ల రాజీ ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదని గ్రహించిన అవధ్ రాణి మక్కా చూసుకుని భారతదేశం తిరిగి వెళ్ళాలని అనుకొంది. అయితే దీనికి బ్రిటిష్ అధికారులు అభ్యంతరం చెప్పారు. అవధ్ రాజ్యమే లేకుండా పోయింది కాబట్టి, అవధ్ పాస్‌పోర్ట్ స్థానంలో బ్రిటిష్ ఇండియా పాస్‌పోర్ట్ తీసుకోవాలని చెప్పారు. ఆపని చేస్తే బ్రిటిష్ వారి అధికారాన్ని అంగీకరించినట్టు అవుతుందని ఆమె నిరాకరించింది.
అవసరంలో ఆదుకున్న ఫ్రాన్స్
ఏం చేయాలో పాలుపోని మాలికా కిష్వర్ ని ఫ్రాన్స్ ప్రభుత్వం ఆదుకుంది. తమ దేశం మీదుగా మక్కాకి వెళ్లవచ్చని ఆమె బృందానికి చెప్పింది. దాంతో జనవరి23, 1958న అవధ్ బృందం ఫ్రాన్స్ చేరింది. అప్పటికే అస్వస్థతకు గురయిన మాలికా కిష్వర్ ఆ మరుసటి రోజే మరణించింది.. ఆమెను అక్కడే స్మశానంలో ఖననం చేశారు. ఆ తరువాత వెంట వెంటనే ఆమె బృందంలో ఉన్న మరో కుమారుడు, మనవరాలు కూడా మరణించారు. ఆ విధంగా అవధ్ రాజ్యం కోసం రాణిగారి ప్రయత్నం ఫ్రాన్స్ లో సమాధి అయింది. వాజిద్ ఆలీ షా ఆ తరువాత అవధ్ చూడకుండానే కలకత్తా సమీపంలో నిర్బంధంలోనే మరణించాడు.
చాలా రోజుల వరకు మాలికా కిష్వర్ సమాధి నిర్లక్ష్యానికి గురయి అనామకంగా పడి ఉన్నది. చాలా రోజుల తర్వాత ఆమె తరువాత అయిదో తరానికి చెందిన అమన్ ఖాన్ ఆమె సమాధిని వెతికి పట్టుకుని శిలాఫలకం ఏర్పాటు చేశాడు.
Also Read : భారతదేశంలో విమానయానం మొదలైన రోజు