iDreamPost
iDreamPost
ఈ మధ్యకాలంలో హిందీ వెబ్ సిరీస్ ల నిర్మాణం ఊపందుకుంది. ఫ్యామిలీ మ్యాన్, మిర్జాపూర్ రెండేసి సీజన్లు ఘన విజయం సాధించడంతో దర్శక నిర్మాతలు అలాంటి యాక్షన్ కం థ్రిల్లింగ్ జానర్స్ కోసం కథలు రాసుకుంటున్నారు. కొందరు గతంలో వచ్చిన ప్రముఖ నవలలను వీటికి అనుగుణంగా మార్చి తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ విషయంలో రాజీ లేకపోవడం, లొకేషన్ల కోసం విదేశాలకు సైతం వెళ్లే వెసులుబాటుని డిజిటల్ కంపెనీలు అందించడం లాంటి కారణాలు ఈ ట్రెండ్ కు కారణం అవుతున్నాయి. అందులో భాగంగా వచ్చిందే ది గ్రేట్ ఇండియన్ మర్డర్. హాట్ స్టార్ లో మొన్న శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. రిపోర్ట్ చూద్దాం.
వ్యాపారవేత్త విక్కీ రాయ్(జతిన్ గోస్వామి) ఓ పార్టీ జరుపుకుంటూ ఉండగా హత్య చేయబడతాడు.అప్పటికే ఇద్దరు అమ్మాయిలను మానభంగం చేసి మర్డర్ చేసిన కేసులో బయటికి వచ్చి ఉంటాడు. ఇతని తండ్రి హోమ్ మినిస్టర్ జగన్నాథరాయ్(అశుతోష్ రానా) తన కొడుకు మీద జరిగిన ఘాతుకానికి సిబిఐ ఎంక్వయిరీ డిమాండ్ చేస్తాడు. సూరజ్ యాదవ్ (ప్రతీక్ గాంధీ), సుధా భరద్వాజ్(రిచా చద్దా) లు విచారణ కోసం నియమింపబడతారు. మొత్తం ఆరుగురు అనుమానితులను గుర్తిస్తారు. అసలు విక్కీని పైలోకానికి పంపింది ఎవరు, దీనికి ఆ రేప్ సంఘటనకు ఏమైనా లింక్ ఉందా అనేది స్మార్ట్ స్క్రీన్ లోనే చూసి తెలుసుకోవాలి.
దర్శకుడు తిగ్మాన్షు ధూలియా 2016లో వచ్చిన వికాస్ స్వరూప్ రాసిన ‘సిక్స్ సస్ పెక్ట్స్’ పుస్తకాన్ని తీసుకుని దాన్ని వెబ్ సిరీస్ కంటెంట్ గా మార్చే ప్రయత్నంలో డీసెంట్ మార్కులు తెచ్చుకున్నారు. ఎపిసోడ్లన్నీ కలిపి చూస్తే నిడివి(8 గంటలు) ఎక్కువ కావడం వల్ల సాగతీత తప్పలేదు. అయినా కూడా స్క్రీన్ ప్లేతో సాధ్యమైనంత ఎంగేజింగ్ గా ఈ మిస్టరీని ప్రెజెంట్ చేశారు. 1992 స్కామ్ తో పేరు తెచ్చుకున్న ప్రతీక్ గాంధీ ఎందుకనో సిబిఐ ఆఫీసర్ గా అంతగా నప్పలేదనిపిస్తుంది. రిషి పంజాబీ ఛాయాగ్రహణం, అజయ్ దేవగన్ ప్రొడక్షన్ వేల్యూస్ రిక్ నెస్ ని తీసుకొచ్చాయి. క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవాళ్లు ట్రై చేస్తే మరీ ఎక్కువ నిరాశ చెందరు
Also Read : Looop Lapeta :లూప్ లపేట రిపోర్ట్