iDreamPost
android-app
ios-app

బండేరు కోన.. మరికొన్ని అందాలు

బండేరు కోన.. మరికొన్ని అందాలు

బండేరు కోన తోలి అందాలు కు  చిరకాలం గుర్తుండే బండేరు కోన యాత్ర  కొనసాగింపు

The Forgotten Bandheru Kona – 2

వాళ్లెంత దూరం పొయినా వంకమ్మిటే పోతారు కదా అనే ధైర్యంతో నచ్చిన ఫోటోలు తీసుకుంటూ నిదానంగా ముందుకు కదిలాము.

మాకంటే ముందే వచ్చిన లోకల్ బ్యాచ్ అక్కడే వంట ప్రోగ్రాం పెట్టారు. వివరాలు అడిగి “ఏన్నా దుకానమీన్నే పెట్న్యారు లోపల బాగలేదా” అంటే “బాగలేకేం బెమ్మాండంగా ఉంటది. మొన్న పొయినపుడు వంటకని మంటపెట్టగానే తేనెటీగెలు సుట్టుకుని తరిమినాయి. అందుకే ఈన్నే వంట చేసుకుని తిని మళ్లా వొచ్చాం” అన్నారు. సరే కానియ్యండి అని ముందుకు సాగిపొయ్యాం.

పొయ్యేదే వంకకాడికయినప్పుడు మళ్లా ఈ క్యాన్ నీళ్లెందుకు గిబ్స్ అని వెంకట్ ని అడిగితే “నువ్వూ నేనూ తాగుతాంబా. వాళ్లు తాగొద్దో” అంటుండంగా ధబ్ మని సౌండ్ వస్తే వెనక్కి తిరిగి చూస్తే క్యాన్ కిందపడింది. కావాలని వేశాడో జారిపడిందో తెలియదు గానీ పీడబొయ్యిందిలే అనుకుంటా ముందుకు సాగాం.

ఇంకా పూర్తిగా అడవిలోకి ప్రవేశించకముందే వంక మీదుగా వచ్చిన చల్లని కొండగాలి మాకు ఆహ్వానం పలికింది.

నీళ్లు పారి పారి వంక మొత్తం రాళ్లు తేలి ఉంది. ఆ రాళ్లల్లోనే నడుచుకుంటూ ముందుకు సాగుతూ చూస్తే అటు ఇటు పచ్చని చీర కట్టిన కొండ. కొండ కూడా ఎవరో శిల్పి గడ్డపార వేసి గండి కొట్టినట్టుగా భలే ఉంది. కొండ పేట్లకు ఉన్న పెద్ద పెద్ద తేనెపెట్టెలు నల్లగా దిష్టి చుక్కలు పెట్టుకున్నట్టుగా ఉన్నాయి.

వంకలో ఎక్కువగా పచ్చగా ఆకులు వేసిన నేరెడు చెట్లు, కానుగ చెట్లే ఉన్నాయి. అక్కడక్కడా అంతర్వాహినిగా ప్రవహిస్తూ మరోచోట పైకి లేస్తూ వంక కూడా సహజ సుందరంగా భలే గమ్మత్తుగా ఉంది. ఎత్తునుంచి కిందికి దూకే చోటుల్లో నీళ్లు, రాళ్లూ కలిసి సంగీతం పలికించినట్టుగా ఉంది.

ఎన్ని యాంగిల్స్ లో తియ్యాలో అన్ని యాంగిల్స్ లో ఫోటోలు తీసుకుంటూ ముందుకు సాగితే చూడగలిగితే ప్రకృతిలో ప్రతిదీ అందమైనదే అన్నట్టుగా ఎండిపొయిన చెట్టు మొద్దు ఒకటి దర్శనమిచ్చింది.

దాన్ని దాటుకుని కొంచెం దూరం పోగానే లింగారెడ్డన్న సారధ్యంలో మా వాళ్లు వంట ప్రోగ్రామ్ పెట్టారు. మిగతా వాళ్లలో కొందరు రాళ్లమింద మరికొందరు కాళ్లల్లో నీళ్లు పెట్టుకుని కూర్చుంటే మనకక్కడ ఉండబుద్ధి కాక మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చంద్రన్నను అడిగాను “ఇట్టా ఎంత దూరం పోవచ్చన్నా” అని.

“ఒక మైలు పోగలిగితే భలే ఉంటుందన్నా” అన్నాడు.

ఇంగ మనమాగుతమా. “సరే మీరు కానీండన్నా. మేం పొయొచ్చామన్నా” వెంకట్, వీరారెడ్డి నేను పోదామనే ఉద్దేశ్యంలో.

ముగ్గురం కొత్తోళ్లను ఎందుకు పంపీడం ఎందుకు అనుకున్నాడో లేకుంటే గత మూడు నాలుగు పర్యటనల్లో తను చూసిన బండేరు కోన అందాలు మాకు పరిచయం చెయ్యాలని అనుకున్నాడో ఏమో గానీ వంట సహాయం వేరే వాళ్లకు అప్పజెప్పి “పోదాంపాన్నా నేనొచ్చా” అన్నాడు చంద్రన్న.

‘నేనూ వస్తా పద” అని సందీప్ కూడా మాతో పాటు బయల్దేరాడు.

ఆ రాళ్లల్లో చెప్పులెందుకుని వాటిని షూష్ అక్కడ వదిలి బండేరు కోన అందాలను వెతుకుతూ ముందుకు సాగిపొయ్యాం.

చిన్న చిన్న జలపాతాలు, రాళ్లను ఒరుసుకుంటూ పారే నీళ్లు, గుండాలు, చేపలు, ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా ఇంకా పద పదమని ఊరిస్తున్నాయే తప్ప ఎక్కడా ఇంక చాలు అని అనిపించలేదు.

చంద్ర అన్న, వీరారెడ్డి ముందు దూసుకుపోతుంటే వారికి కొంచెం దూరంలో మధ్యలో సందీప్ వెనకాల వెంకట్, నేను ఆ అడవి అందాలను జయించడానికి బయల్దేరాం.

నీళ్లు కూడా ఒక్కో చోట ఒక్కో రంగులో దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే లోపలున్న రాళ్లు కేడా అతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలా అలా దాదాపూ గంటన్నర సేపు అలుపనేది లేకుండా నడుస్తూనే ఉన్నాము.

చెప్పాలని చెప్పడం కాదు గానీ యాత్ర గురించి తెలిసినప్పుడు అక్కడేముంటదిలే అనుకున్నా, అడవి మొదలవకముందు ఇదేదో వంక అనుకున్నా, కొంచెం దూరం వెళ్లాక పరవాలేదే అనుకున్నా అక్కన్నుంచి ఇంకాస్త ముందుకు వెళ్లాక చాలా బాగుంది కదా అనుకున్నా చివరికి నిత్యధార జలపాతం వెళ్లాక అప్పటివరకూ వేధించిన ఆకలి స్థానంలో ఏదో తెలియని ఆనందం మనసును తడిమేసింది.

అక్కడున్న కానుగ చెట్టుకింద సదరమైన బండమింద మింద పడుకుని అలా కళ్ళు మూసుకుంటే జీవితం గురించి, ఆనందం గురించి వేల వేల ఆలోచనలు తన్నుకొస్తున్నాయి. రెండు మాంచి సినిమా డైలాగులు కూడా ఒక కొలిక్కి వచ్చాయనుకో.

అక్కన్నుంచి పైకి వెళ్తే ఇంకా బాగుందంట కానీ అప్పటికే ఆలస్యమైంది ఎక్కడ నేను అవి చూస్తే ఇంగా పోదాం పద అంటానని పైనేమీ లేదని నాకు అపద్దం చెప్పి వెనక్కి మల్లించారంట. తర్వాత చెప్పారు.

అసలే కరోనా కాలం. ఏ మాత్రం జలుబు చేసినా లేనిపోని అనుమానాలు అని అంతసేపు ఈతాడుకుండా నిగ్రహించుకుంటూ వచ్చిన నా నిగ్రహం ఒకచోట బద్దలైంది. ఏదైతే అది కానీలే అని దూకి ఈతాడుకుంటూ వచ్చాం.

చూడగలిగితే కేరళ, ఊటి, కొడైకెనాల్ లకు ఏ మాత్రం తీసిపోని అందాలెన్నో ఉన్నాయి మన దగ్గర. అద్భుతం కావాల అద్భుతం కావాల అని ఆరాటపడకుండా తిరిగే ఓపికుండాల.

తర్వాత కిందికొచ్చేసరికి వేడి వేడి నాటుకోడి చికెన్, తెల్ల బువ్వ, రసం చేసి రెడీగా పెట్టాడు లింగారెడ్డెన్న. చూట్టూ పచ్చని అడవి, కాళ్లకింద గలగలపారే నీళ్లు, లోపల తరిమే ఆకలి. తింటాంటే ఇంగా కావాల ఇంగా కావాల అనిపించింది. ఏ మాటకామాట చెప్పకోవాల ఏమేసి చేసినాడో గానీ రసం మాత్రం బెమ్మాండంగా ఉండాయి.

వీలైతే వెళ్లిరాండబ్బా. స్త్రీలు, పిల్లలతో వెళ్లే వారు భద్రత దృష్ట్యా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అడివి ప్రదేశం కదా మన ముందు జాగ్రత్తలో ఉండాలి. యూత్ కైతే మంచి డెస్టినేషన్ స్పాట్.

ప్లేస్:

బండేరు కోన, రెడ్డి పల్లె, శవాస్ ఖాన్ పల్లె, చింతకొమ్మదిన్నె మండలం.

కడప నుండి ఇరవై కిలోమీటర్లు కారు లేదా బైక్ వెళ్తుంది. అక్కన్నుంచి మీ ఓపికను బట్టి నడక దూరం.

సరదాగా వంట చేసుకుని తిని, ఈదిలాడి వద్దాం అంటే నాలుగు కిలోమటర్ల నడక, లేదు బండేరు కోన అందాలను మీ మది లోయల్లోముద్రించుకోవాలంటే నాలుగు కిలోమీటర్లు వెళ్తే ఎన్నెన్నో అద్భుతాలు. ఆ తర్వాత మీ ఓపిక.