Uppula Naresh
Uppula Naresh
మహిళలు ఆకాశంలో సగం అంటూ కొందరు గొప్పగా కీర్తిస్తుంటారు. మరీ ముఖ్యంగా మహిళా దినోత్సవం రోజు మహిళలపై ఎక్కడలేని ప్రేమ ఒక్కసారిగా పొంగిపోతుంది. కానీ, అదే గౌరవం మిగతా రోజుల్లో అస్సలు కనిపించదు. పేరుకి మహిళలను గౌరవిస్తామని లీడర్ల నుంచి గల్లీలో అరుగుల మీద కూర్చునే వ్యక్తుల వరకు ప్రతోడు లెక్చర్స్ ఇస్తుంటారు. ఇవన్నీ మాటలకే పరిమితమని తాజా ఘటనే నిరూపిస్తోంది. ఒడిశాలో సిబ్బంది మొదటగా బస్సులో మహిళను ఎక్కనీయడం అపశకునమంటూ బస్సెక్కిన మహిళను బలవంతంగా కిందకు దించారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషనే రంగంలోకి దిగింది. అసలు విషయం ఏంటంటే?
సమాజంలో మూఢ నమ్మకాలు తొలిగిపోయాయని కొందరు అంటుంటారు. కానీ, ఆ ప్రభావం ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా రాజ్యమేలుతోంది. తాజాగా ఒడిశాలో జరిగిన మహిళకు ఘోర అవమానమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్ బారాముండా బస్టాండులో ఇటీవల అందరికంటే ముందు ఓ బస్సులో ఓ మహిళ ఎక్కి కూర్చుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. బస్సెక్కిన ఆ మహిళను బలవంతంగా కిందకు దించారు. ఎందుకని ఆ మహిళా ప్రయాణికురాలు ప్రశ్నిస్తే.. మొదటగా మహిళ బస్సెక్కడం అపశకుమని చెప్పి పంపించారు.
ఈ అవమానంతో ఆ మహిళ తల దించుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై సోనేపూర్ కు చెందిన సామాజిక కార్యకర్త ఘసిరామ్ పాండా స్పందించి.. ఒడిశా మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తొలుత బస్సులో మహిళ ఎక్కడం అపశకునమా అంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర మహిళా కమిషన్ వెంటనే స్పందించి విచారణ చేపట్టింది. బస్సులో మొదటగా ఓ మహిళ ఎక్కితే ఆ రోజు ఆదాయం సరిగ్గా రాకపోవడం, ఆ బస్సు ప్రమాదానికి గురి కావడం వంటి మూఢ నమ్మకాలు వదిలేయాలని హెచ్చరించింది.
ఇలాంటి వివక్ష ధోరణిని అందరూ విడిచిపెట్టాలని సూచించింది. ఇదే కాకుండా ఇక నుంచి మహిళలను బస్సులో తొలి ప్యాసెంజర్ ఎక్కే విధంగా రాష్ట్ర రవాణా శాఖకు ఆదేశాలు కూడా జారీ చేయడం విశేషం. ఇదే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బస్సులో మొదటగా మహిళలను ఎక్కనీయడం నిజంగానే అపశకునమని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ‘ఇండియా’ అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలంటూ BJP MP డిమాండ్!