iDreamPost
android-app
ios-app

పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన ముఖ్యమంత్రి

పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన ముఖ్యమంత్రి

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో మార్చి 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారం కొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. దాంతో మరికొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆదేశాలు జారీచేశారు.

గతంలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా పదో తరగతి మెరిట్‌ జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా రద్దైన పరీక్షలకు మాత్రం విద్యార్థులందరికీ పాస్ మార్కులు వేస్తామని తద్వారా పై తరగతులకు ప్రమోట్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇంటర్ పరీక్షలను మాత్రం జూన్ 8 నుండి 16 వరకూ నిర్వహించాలని మధ్యప్రదేశ్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ నిర్ణయించింది. దాంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు కూడా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి 19 నుంచి లాక్‌డౌన్‌ ముగిసేవరకు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల నుంచి కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి తాజా ఆదేశాలతో ఇంకా జరగాల్సి ఉన్న పదో తరగతి పరీక్షలు రద్దు కావడంతో పాటు రద్దైన పరీక్షలకు విద్యార్థులందరికీ పాస్ మార్కులు లభించడంతో పాటు పై తరగతులకు కూడా ప్రవేశం లభించనుంది.