iDreamPost
android-app
ios-app

నిధి వేటలో జీవిత సారాన్ని చెప్పే “The Alchemist”

నిధి వేటలో జీవిత సారాన్ని చెప్పే “The Alchemist”

కొన్ని పుస్తకాలు వాటితో పాటు మనల్ని కూడా తీసుకెళ్తాయి. ఎన్నో విషయాలు చెప్తాయి.. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం ఆనాడే చెప్పాడు.. అలాంటి ఒక మంచి పుస్తకం గురించిన పరిచయం ఇది.. “The Alchemist”  పుస్తకాన్ని పాలో కొయిలో రచించాడు.. ఒకసారి ఆ పుస్తకంలోకి తొంగి చూస్తే జీవిత సత్యాలు ఎన్నో బోధపడతాయి..

స్పెయిన్ దేశానికి చెందిన ఒక రైతు కుమారుడు శాంటియాగో అనే యువకుడి కథ ఇది.ఆ రైతు తన కుమారుడిని చదివించి మత గురువుని చేయాలనుకొంటాడు. ఆ యువకుడికేమో కొత్త ప్రదేశాలు చూసి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉత్సాహం. చదువు పూర్తయిన తరువాత తన కోరిక తీర్చుకోవడం కోసం గౌరవనీయమైన మత గురువు అయ్యే అవకాశం వదిలి ఒక సాధారణ గొర్రెల కాపరిగా మారి దేశాటన ప్రారంభిస్తాడు.

ఆ క్రమంలో అతడు ఒక పాడుబడ్డ చర్చి దగ్గర నిద్రించేటప్పుడు ఒక ‘కల’ కంటాడు. ఆ కలలో ఒక అందమైన అమ్మాయి అతడిని ఈజిప్ట్ లోని పిరమిడ్ల వద్దకు రమ్మనీ, అక్కడకు వస్తే ఒక ‘నిధి’ దొరుకుతుంది అని చెప్తుంది. మళ్లీ మళ్లీ ఆ కల రావడంతో ఆ నిధి ని వెతుకుతూ అక్కడికి వెళ్లాలని శాంటియాగో నిర్ణయించుకుంటాడు.

కొన్ని వేల మైళ్ళ దూరం -సంవత్సరాల కాలం. ఆ క్రమంలో అతని అనుభవాలు, జీవితం నేర్పిన పాఠాలు . జల మార్గంలో స్పెయిన్ దేశం దాటి ఆఫ్రికా లోని మైదానాలు నుండి ఎడారుల నుండి విభిన్నమైన మనుషులతో నూ… పరిస్థితులనుండి నేర్చుకుంటూ, తెలుసుకుంటూ ఈజిప్ట్ లోని పిరమిడ్ల వైపు సాగే పయనం.

ఆ క్రమంలో లో ఒకసారి అప్పటివరకు తను సంపాదించిన సర్వస్వాన్ని కోల్పోతాడు. మరోసారి అంతకు ముందున్న దానికంటే ఎక్కువగానే సంపాదిస్తాడు. మళ్లీ పోగొట్టుకుంటాడు. అలాంటి ప్రయాణంలో ఎలా పిరమిడ్ల వద్దకు చేరుకున్నాడు నిధిని కనుగొన్నాడా లేదా అనేదే కథ.

ఇది ఒక ప్రతీకాత్మక కథ. జీవన శైలి ని ఎన్నుకోవడం నుంచి జీవన గమ్యం నిర్దేశించుకొని ఆ వైపుగా సాగిపోవడం గురించి చెబుతుంది. సమాజంలో గౌరవం, విలువ ఇచ్చే వృత్తిలో ఉండాలా లేక ‘తనకు నచ్చినట్లు’ జీవించేందుకు గొర్రెల కాపరిగా మారాలా అనేది నిర్ణయించుకోవడం నుండి ‘కల’ ను సాకారం చేసుకునేందుకు ఎలా సాగిపోవాలో చెబుతుంది.

ఇంతకుముందు అనుకున్నట్లు ఇక్కడ కల అనేది ఒక ప్రతీక. మనందరికీ కూడా ఒక కల ఉంటుంది , కనీసం యవ్వనంలో జీవితం ప్రారంభించేటప్పుడు. ఆ కలను నిజం చేసుకునే దిశగా పయనిస్తున్నామా, దాన్ని మర్చిపోయి మామూలుగా బ్రతికేస్తున్నామా! అనేది గుర్తు చేస్తుంది. కొత్తదనంలోకి వెళ్లేటప్పుడు ఉండే రిస్కు భయం, ఒక స్థాయి కి వెళ్ళాక జీవితం ఇక్కడ బాగానే ఉందిగా అనిపించే కంఫర్ట్ జోన్ గురించి, పట్టి ఉంచే ప్రేమ బంధం గురించీ, అక్కడే ఆగిపోతే కరిగిపోయిన కల ఎక్కడో మనసు అంతరాల్లో కలిగించే అసంతృప్తి గురించి చెబుతోంది.

ఏదో సందేశం ఇస్తున్నట్లు అనిపించకుండానే ఎన్నెన్నో చెప్పటం ఈ కథ ప్రత్యేకత. ప్రతి పేరా ఏదో ఒక విషయం చెపుతుంది. ఒక్కసారి చదవడం ప్రారంభిస్తే కథ కథనం ఉత్తేజితంగా, ఉత్సాహ భరితంగా ఆసక్తికరంగా చివరికంటా చదివిస్తుంది. చదివిన ప్రతిసారి అంతకుముందు గమనించని కోణం ఏదో కనిపిస్తుంది. శాంటియాగో పిరమిడ్లను చేరుకున్న తర్వాత ముగింపు మరింత డ్రమెటిక్ గా ఉంటుంది.

“The Alchemist” అనే160 పేజీల ఈ చిన్న పుస్తకం 160 దేశాలలో 66 భాషలలోకి అనువదింపబడింది అంటేనే ఇది ఎంతగా ఆకట్టుకుందో తెలుస్తుంది. ‘పరుసవేది’ అనే పేరుతో తెలుగులో కూడా ఈ పుస్తకం లభిస్తుంది. ప్రతివారు ఒక్కసారైనా తప్పక చదివి తీరాల్సిన పుస్తకం ఇది.

Written By – Rajesh Kumar