iDreamPost
iDreamPost
తమిళనాడు రాజకీయాల్లో, సినీ చరిత్రలో చెరిగిపోలేని ముద్రవేసుకుని తన మరణం కూడా సంచలనం అయ్యే స్థాయికి చేరుకున్న నటీ మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా తలైవి. ఇందాక జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ట్రైలర్ ని లాంచ్ చేశారు. గతంలో ఇదే పాయింట్ మీద రమ్యకృష్ణ చేసిన వెబ్ సిరీస్ పాపులర్ కాగా కంగనా రౌనత్ తో దర్శకుడు విజయ్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఉత్తరాది నటి ఇంత పవర్ ఫుల్ క్యారెక్టర్ కు ఎంతవరకు న్యాయం చేయగలదన్న అనుమానం అందరిలోనూ తలెత్తింది. వాటిని పటాపంచలు చేసేలా ట్రైలర్ ని చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా కట్ చేశారు.
చాలా స్పష్టంగా సినిమాలో ఏం ఉండబోతోందో చెప్పేశారు. జయలలిత సినిమాల్లోకి ప్రవేశించడం, ఎంజిఆర్ కాంబోలో బ్లాక్ బస్టర్లు, ఆపై ఆయన ప్రోత్సాహంతో రాజకీయ ప్రవేశం, ఆయన చనిపోయాక జరిగిన అవమానం, ద్రౌపతి తరహాలో చేసిన శపథం, నెరవేర్చుకున్న విధానం అన్ని డిటైల్డ్ గా ఇందులో పొందుపరిచారు. ఆశ్చర్యకరంగా కంగనా జయ పాత్రకు మంచి ఛాయస్ గా నిలిచింది. హావభావాలు, శారీరక బాష తదితర విషయాల్లో తీసుకున్న జాగ్రత్తలు బాగా ఉపయోగపడ్డాయి. ఎంజిఆర్ గా అరవింద్ స్వామి అద్భుతంగా మ్యాచ్ అయ్యాడు. ఆర్టిస్టుల మేకప్ విషయంలో తీసుకున్న శ్రద్ధ అడుగడుగునా కనిపిస్తుంది.
అయితే తెలుగు ఆడియన్స్ కి అంతగా కనెక్టివిటీ లేని జయ కథను మన ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారో చూడాలి. ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమాలను కలిపినట్టుగా అనిపించినా ఆశ్చర్యం లేదు. అయితే రిచ్ మేకింగ్, ఆకట్టుకునే విజువల్స్, జయ జీవిత క్రమాన్ని పూర్తిగా చూపించాలని దర్శకుడు విజయ్ పడిన తపన తలైవి మీద ఆసక్తి పెంచుతోంది. బాహుబలి కథకులు విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు విస్తరణ చేశారు. విశాల్ విట్టల్ ఛాయాగ్రహణం, జివి ప్రకాష్ సంగీతం టెక్నికల్ గా స్థాయిని పెంచాయి. ఏప్రిల్ 23న నాని టక్ జగదీశ్ తో పాటుగా తలైవి రిలీజ్ కాబోతోంది. తెలుగులోనూ అదే టైటిల్ ఎందుకు పెట్టారో అంతుచిక్కలేదు.
Trailer Link @ https://bit.ly/399NfgC