iDreamPost
iDreamPost
అలనాటి హీరోయిన్, తమిళనాడు మాజీ సిఎం జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన తలైవి నిన్న భారీ విడుదలనే దక్కించుకుంది. కంగనా రౌనత్ టైటిల్ పాత్రలో అరవింద్ స్వామి ఎంజిఆర్ గా నటించిన ఈ సినిమా మీద అంచనాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా లేవు కానీ రాజకీయ నేపధ్యాలను ఇష్టపడే వాళ్ళను దీని ప్రమోషన్లు బాగానే ఆకర్షించాయి. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు మన ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయాయి. ఈ నేపథ్యంలో నటిగా తప్ప పొలిటికల్ గా మనకు అంతగా కనెక్టివిటీ లేని జయ గాధను ఎలా రిసీవ్ చేసుకుంటారన్న అనుమానం లేకపోలేదు. గట్టి పోటీ మధ్య రిలీజైన తలైవి ఎలా ఉందో రిపోర్ట్ లో లుక్ వేద్దాం
ముప్పై రెండేళ్ల క్రితం 1989లో తమిళనాడు అసెంబ్లీలో అప్పటి సిఎం కరుణానిధి హయాంలో తనకు జరిగిన అవమానానికి బదులుగా ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగి అక్కడ అడుగు పెడతానని శపథం చేస్తుంది జయలలిత(కంగనా రౌనత్). కట్ చేస్తే కథ 1965 నాటి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తుంది. హీరోయిన్ గా ఆవిడ కెరీర్ ఎలా మొదలయ్యింది, 16 ఏళ్ళ లేత ప్రాయంలోనే ఎంజిఆర్ సరసన నటించే అవకాశం ఎలా దక్కింది, తర్వాత ఆయన ప్రోద్భలంతో రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించింది, ఎదురైన సవాళ్లు ప్రమాదాలు ఏమిటి వాటిని ఎలా ఎదురుకుంది లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే థియేటర్ కు వెళ్లి వెండితెరపై అమ్మదర్శనం చేసుకోవాల్సిందే.
తలైవి నిస్సందేహంగా మంచి ప్రయత్నమే. ఆ పాత్రకు తను సూట్ అవుతుందా లేదా అనే అనుమానాలకు చెక్ పెడుతూ కంగనా అందులో పరకాయ ప్రవేశం చేసిన తీరు ఆకట్టుకుంది. అయితే అంతే సమానంగా ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగా ఎంజీఆర్ క్యారెక్టర్ లో అరవింద్ స్వామి చెలరేగిపోయాడు. వివాదాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో జయ జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను, శోభన్ బాబు లాంటి కీలక వ్యక్తుల ప్రమేయాన్ని టచ్ చేయకపోవడం ఇందులో ప్రధాన మైనస్. నిడివి పరంగానూ కొంత ల్యాగ్ ఉంది. ఈ తరహా బయోపిక్కులను ఇష్టపడేవారికి తలైవి మంచి ఛాయస్ గానే నిలుస్తుంది. కాకపోతే పరిమిత అంచనాలతోనే సుమా
Also Read : నెట్ సినిమా రిపోర్ట్