Idream media
Idream media
పగ, ప్రతీకారం ఇదో జానర్. హాలీవుడ్‌లో 1966లో The Good Bad And Ugly సినిమా సూపర్‌హిట్ తర్వాత ఆ తరహా సినిమాలు తెలుగులో కూడా మొదలయ్యాయి. మెకనాస్‌గోల్డ్ , గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీని మిక్సీలో రుబ్బితే మోసగాళ్లకు మోసగాడు (1971) తయారైంది. ఆరుద్ర అద్భుతంగా చేసిన ఈ కథ సూపర్‌హిట్. నిధి వేటతో పాటు , అమ్మానాన్నలని చంపిన వారిపై ప్రతీకారం కూడా ఉంటుంది.
తర్వాత చిన్నప్పుడు తనకు అన్యాయం చేసిన వాళ్లపై పెద్దయ్యాక పగ తీర్చుకునే కథలొచ్చాయి. విలన్‌ని గుర్తు పట్టడానికి ఏదో గుడ్డి గుర్తు ఉంటుంది. ఒక లాకెట్‌ని 25 ఏళ్లపాటు విలన్ మెడలో వేసుకుని ఉంటాడు. దాని ఆధారంగా హీరో ప్రతీకారం తీర్చుకుంటాడు.
ఒక సినిమాలో రెండు వేర్వేరు నెంబర్ బూట్లు విలన్ వేసుకుంటాడు. బూట్లు మానేసి చెప్పులు వేసుకుంటే కథ కంచికే. కానీ హీరోకి దొరికిపోవడానికి వాడు అవే బూట్లు వేస్తూ ఉంటాడు. లేదంటే విలన్ చేతికో , గుండెల మీదో పచ్చబొట్టు ఉంటుంది. అది కాకపోతే మెడ మీద గోక్కునే మేనరిజం ఉంటుంది.
ఇలాంటి సినిమాలు కృష్ణ చాలా చేశాడు. రివాల్వర్‌ని లోడ్ చేయకుండా నాన్‌స్టాప్‌గా కాల్చగల సమర్థుడు కృష్ణ.. శోభన్‌బాబు కూడా ఒకట్రెండు సినిమాలు ప్రయత్నించాడు. (దెబ్బకు ఠా దొంగల ముఠా) కానీ కృష్ణ స్పీడ్‌కి ఆగలేకపోయాడు.
కొంతకాలం హీరోయిన్స్ కూడా పగ తీర్చుకున్నారు. రౌడీరాణి (విజయలలిత), కొరడా రాణి (జ్యోతిలక్ష్మి) ఇలాంటి పేర్లతో. వాణిశ్రీ కూడా తుపాకి పట్టుకుంది కానీ పేల్చలేకపోయింది.
70 తర్వాత ఈ కౌబాయ్, క్రైం సినిమాలు మెల్లిగా కనుమరుగై పోయాయి. మహేశ్‌బాబు టక్కరిదొంగ తీశాడు కానీ, అది ఆడలేదు.
ఇది కాకుండా జేమ్స్‌బాండ్ ప్రేరణతో కొంత కాలం సినిమాలు వచ్చాయి. జేమ్స్‌బాండ్ 777, ఏజెంట్ గోపి (కృష్ణ).
ఒక సైంటిస్ట్ ఊరికే ఉండకుండా ఏదో కనిపెడతాడు. ఆ ఫార్ములా కోసం విలన్లు వెంటాడితే హీరో కాపాడుతాడు. ఆ సైంటిస్ట్ కూతురు హీరోయిన్ అయి ఉండాలి. ఇది రూల్.
ఈ సినిమాలు చూసి సైంటిస్గులంతా పిల్లి గడ్డం పెట్టుకుని పిచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతారని ప్రేక్షకులు అనుకునేవాళ్లు.