iDreamPost
android-app
ios-app

కామెడీ సినిమా అడ్రెస్ ఎక్కడ? – Nostalgia

  • Published Jan 07, 2020 | 5:04 PM Updated Updated Jan 07, 2020 | 5:04 PM
కామెడీ సినిమా అడ్రెస్ ఎక్కడ? – Nostalgia

ఒకప్పుడు రాజేంద్రప్రసాద్, నరేష్ లాంటి హీరోలు కేవలం హాస్యభరిత చిత్రాల ద్వారానే గుర్తింపు తెచ్చుకుని స్టార్లు అయ్యారు. కమర్షియల్ సినిమాలకు ధీటుగా వీళ్ళ చిత్రాలు వసూళ్లు సాదించేవి. స్వర్గీయ డి రామానాయుడు గారు తీసిన అహ నా పెళ్ళంట ముప్పై ఏళ్ళ క్రితం సిల్వర్ జూబ్లీ ఆడడానికి కారణం కామెడీ కంటెంటే తప్ప మరొకటి కాదు. పెద్ద హీరోతో పోటీ పడి మరీ చిత్రం భళారే విచిత్రం, జంబలకిడిపంబలు సూపర్ హిట్ కావడం ఎవరూ మర్చిపోలేరు.

వంశీ ఏప్రిల్ 1 విడుదల, లేడీస్ టైలర్ వంటి వాటితోనే గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకులు రేలంగి నరసింహారావు ఈ జానర్ లోనే పెద్ద ఎత్తుకు ఎదిగారు. ఆ తర్వాత హీరో అల్లరి నరేష్ కొంతమేర ఈ విభాగంలో ఒక బ్రాండ్ ను ఏర్పరుచుకున్నప్పటికీ అతి తక్కువ టైంలో రోటిన్ కథలతో పరాజయాలు పొంది ఆఖరికి మహర్షితో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకరకంగా చెప్పుకుంటే కామెడీ కోసమంటూ ప్రత్యేకంగా ఏ హీరో లేడు. కేవలం కథలో భాగంగా హాస్యాన్ని జొప్పిస్తున్నారు తప్పించి విడిగా తీసే సాహసం ఎవరూ చేయడం లేదు.

పోనీ ఇప్పటి సినిమాల్లో వస్తున్న కామెడీ అయినా మెప్పించే స్థాయిలో ఉందా అంటే దానికి వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి. చాలా మటుకు మిస్ ఫైర్ అవుతున్న దాఖలాలు ఎక్కువ. ఇంట్లో కూర్చుని ఫ్రీగా టీవీలో జబర్దస్త్, అదిరింది లాంటి కామెడీ షోలతో కావాల్సినంత వినోదాన్ని అందుకుంటున్న ప్రేక్షకులను అదే పనిగా థియేటర్ కు రప్పించాలంటే చాలా బలమైన కారణం ఉండాలి. ఓ రెండు వందలు ఖర్చు పెట్టుకుని వచ్చే ఆడియన్స్ కి నవ్వు రప్పించడం అంత తేలిక కాదు.

అందుకే సాదాసీదా విషయంతో వచ్చిన కామెడీ సినిమాలు ఇటీవలి కాలంలో అపహాస్యం పాలయ్యాయి. ఇప్పుడు ఆ కాలం లేదు. చూసేవాళ్ళ అభిరుచులు మారాయని దర్శక రచయితలు సమర్ధించుకునే ప్రయత్నం చేయవచ్చు కానీ గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ఎఫ్2 అంత పెద్ద హిట్ అవ్వడంలో కారణం వెతికితే సమాధానం ఈజీగా దొరుకుతుంది. కాస్త బుర్రకు కలానికి పదును పెట్టి సరైన పాళ్ళలో హాస్యాన్ని జొప్పిస్తే వాటిని ఇష్టపడని వారు ఉండరు. జంధ్యాల నుంచి త్రివిక్రమ్ దాకా అందరూ చేసింది ఇదే. మరి ఈ జానర్ లో ఏర్పడ్డ గ్యాప్ ని భర్తీ చేసే హీరోలు దర్శకులు ఎవరో.