iDreamPost
android-app
ios-app

రెండు జళ్ళు వేసుకోలేదని 200 గుంజీలు తీయించారు.. మైనారిటీ స్కూల్లో టీచర్ల నిర్వాకం

రెండు జళ్ళు వేసుకోలేదని 200 గుంజీలు తీయించారు.. మైనారిటీ స్కూల్లో టీచర్ల నిర్వాకం

క్రమశిక్షణ పేరుతో ఓ టీచర్ బాలికల చేత 200 గుంజీలు తీయించింది. ఆ పిల్లలు హాస్పిటల్ పాలు కావడంతో విషయం బయటికొచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల టౌన్ లో కావేరమ్మ పేటలోని ఓ మైనారిటీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ లో బుధవారం ఈ దారుణం జరిగింది. రెండు జళ్ళు వేసుకోలేదన్న కారణంతో PET శ్వేత 50 మంది అమ్మాయిలతో 120 నుంచి 200 దాకా గుంజీళ్ళు తీయించింది. దీంతో పిల్లలు నడవలేకపోయారు. ఒళ్ళు నొప్పులతో కొందరికి జ్వరమొచ్చింది. విషయం బయటికి పొక్కకుండా టీచర్లు 50 మందినీ సిక్ రూంలో వేసి తాళమేశారు. వైద్యాధికారులకు కనీస సమాచారమివ్వలేదు. తమకు తోచిన ట్రీట్ మెంట్ చేశారు. గురువారం మధ్యాహ్నానికి 50 మందిలో 20 మందికి జ్వరం ఎక్కువైపోయింది. దీంతో అర్బన్ హెల్త్ సెంటర్ కి తీసుకెళ్ళి ప్రాథమిక చికిత్స చేయించాల్సి వచ్చింది.

కొందరు పిల్లలు అమ్మానాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వాళ్ళు స్కూల్ కొచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనను కవర్ చేయడానికి వెళ్ళిన రిపోర్టర్లను టీచర్లు అడ్డుకున్నారు. సెలవులో ఉన్న ప్రిన్సిపాల్ కల్పన చివరికి గురువారం సాయంత్రం స్కూలుకొచ్చి ఇది చాలా చిన్న విషయం అని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. చివరికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు PET శ్వేతను కాంట్రాక్ట్ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు గురుకుల RLC జమీర్ అహ్మద్ ప్రకటించారు.