iDreamPost
android-app
ios-app

ఢిల్లీలో ఏం జరిగింది.. టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల్లో చర్చలు

ఢిల్లీలో ఏం జరిగింది.. టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల్లో చర్చలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. ఆ వెంటనే.. అదే రాత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్‌కు కేసీఆర్‌ వచ్చిన వెంటనే సంజయ్‌ ఢిల్లీకి బయలుదేరడంతో ఇరు పార్టీల్లోనూ దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ నేతల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక ప్రతిపాదన పెట్టారని, దీనిపై చర్చించేందుకే బండికి పిలుపొచ్చినట్లు భావిస్తున్నారు.

తెలంగాణాలో గత కొన్నిరోజులుగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత అనూహ్యంగా పెరుగుతుండటం, రాష్ట్రంలో తమ పార్టీ పుంజుకుంటున్న నేపథ్యంలో ‘గులాబీ దళం’ విషయంలో తమ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీఆర్‌ఎస్‌ వర్గాలు కూడా అదే అంచనాతో ఉన్నట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో అటు టీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీ అధినేతల చర్చలపై ఎన్నెనో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నేడు కీలక సమావేశం..?

బీజేపీ ముఖ్యనేతలు, జిల్లా నాయకత్వంతో 15న కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. భవిష్యత్‌ కార్యాచరణ వివరించడంతో పాటు జిల్లా, మండల స్థాయిలో శిక్షణ తరగతులపైన వివరించనున్నారు. పార్టీలోకి కొత్తనేతల రాక పెరిగిన నేపథ్యంలో పార్టీ సైద్ధాంతిక విధానాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ నాయకత్వం నుంచి వినయ్‌ సహస్ర, గిరిధర్‌ హాజరు కానున్నారని తెలుస్తోంది. తదుపరిదశలో మండలస్థాయిలో రెండురోజుల శిక్షణ కొనసాగనుందని చెప్పారు.