Idream media
Idream media
అనుకున్నది అనుకున్నట్టు జరిగితే భారతదేశంలోనే అతిపెద్ద హైవే ఉన్న సొరంగమార్గం హైదరాబాద్ లో నిర్మించబడుతుంది. ఈ సొరంగమార్గం సుమారు పది కిలోమీటర్ల పొడవు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 12 జంక్షన్ వరకు నాలుగు లైన్ల రహదారి కలిగి ఉండేలా ఒక సొరంగాన్ని తవ్వించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు బాధ్యతలు అప్పగించడంతో ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేటి టెక్నికల్ కన్సల్టెంట్ లను జిహెచ్ఎంసి సంప్రదిస్తోంది.
ప్రస్తుతానికి కాశ్మీర్ లో ఉన్న శ్యామా ప్రసాద్ ముఖర్జీ సొరంగం అనేది భారతదేశంలో అతి పొడవైన సొరంగ మార్గం. దాని పొడవు 9.20 కిమీలు. ముంబైలో ఒకచోట ఇలాగే తవ్వాలి అని ప్రతిపాదించారు కానీ అది మాత్రం కుదరలేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేసింది. కెబిఆర్ పార్కు లోపలి నుంచి రోడ్డు వేయాలంటే వందలాది చెట్లను నేలమట్టం చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా తెలంగాణ ప్రభుత్వం గతంలో కెబిఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్ లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది.
వాటి ద్వారా ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని భావించింది. కానీ ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని చూసినా 1500 చెట్లు కూల్చి వేయాల్సి వస్తుందని తేలింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదించగా కేంద్ర ప్రభుత్వం ఒక్క చెట్టు మీద కూడా చేయి వేయకూడదు అని హెచ్చరించింది. కెబిఆర్ పార్క్ రెండోగేటు లోపల ఉన్న ప్రతి చెట్టు ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోకి వస్తాయి కాబట్టి వాటిని ముట్టుకోవద్దని హెచ్చరించింది. దీంతో ఇప్పుడు సొరంగ మార్గం మీద దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు నిపుణులను సంప్రదిస్తున్నారు.