Idream media
Idream media
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానిదే అధికారమని, ఏకంగా నూట యాభైకి పైగా సీట్లు సాధిస్తామని పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెగ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. తీరా సీన్ చూస్తే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ గెలుస్తుందా అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల నుంచి పరిషత్ ఎన్నికల వరకు ఫలితాలను పరిశీలిస్తే టీడీపీ డౌన్‌పాల్ అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.
అచ్చెన్నాయుడుకు సొంత నియోజకవర్గం టెక్కలిలో పరిషత్ ఎన్నికలు కోలుకోలేని దెబ్బ తీశాయి. అక్కడ నాలుగు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. టెక్కలి జెడ్‌పీటీసీ స్థానం స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ వాణి అత్యధిక మెజార్టీ సాధించింది. అచ్చెన్న సొంత మండలం కోటబొమ్మాళిలో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దుబ్బ వెంకట రమణరావు విజయబావుటా ఎగురవేశారు. నియోజకవర్గంలో 78 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా, తెలుగుదేశం కేవలం నాలుగు స్థానాలకే పరిమితం కావడం.. అక్కడ పతనమవుతున్న ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోంది. బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారం చేపడతామని చెబుతున్న అచ్చెన్న ముందు తాను ఓటమి చెందకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.
ఇంకో విషయం ఏంటంటే.. టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఏమీ కాదు. ఇక్కడ ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. ఇప్పటి వరకూ టెక్కలి నియోజకవర్గంలో ఐదు సార్లు టీడీపీ ఓడిపోయింది.
ఏడు సార్లు గెలిచింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అచ్చెన్నాయుడు మెజార్టీ కూడా తగ్గుతూ వస్తోంది. అచ్చెన్నాయుడు గతంలో హరిశ్చంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ నియోజకవర్గం రద్దు కావడంతో 2009లో జరిగిన ఉప ఎన్నిక, ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికలో అచ్చెన్నాయుడు ఓటమిపాలయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన రేవతిపతి మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పుడు రేవతి పతి భార్య భారతిని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించడంతో అచ్చెన్నాయుడు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇలా సాధారణ ఎన్నిక, ఉప ఎన్నికల్లో రెండుసార్లు అచ్చెన్న ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు.. వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్ పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడి చేసిన అక్రమాలను తవ్వి చూపుతూ చుక్కలు చూపెడుతున్నారు. అలాగే.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిస్తూ ఆకట్టుకుంటున్నారు. జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాక మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో స్టేట్‌మెంట్‌లు మాని అచ్చెన్నాయుడు నియోజకవర్గంపై దృష్టి పెట్టకపోతే టీడీపీ అధికారంలోకి రావడం అటుంచితే.. ఆయన అధికారం దూరం కావడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు.