నదిలో కొట్టుకొస్తున్న ఆయుధాలు, పేలుడు పదార్థాలు!

ఇటీవల సిక్కిం రాష్ట్రంలో వరదలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. సిక్కిం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు చెరువులను తలపించాయి.  ఇప్పుడిప్పుడే పలు ప్రాంతాలలు వరద నుంచి కోలుకుంటున్నాయి. అయితే తీస్తా నది పరీవాహక ప్రాంతం మాత్రం ఇంకా వరద గుప్పెట్లోనే ఉంది. సిక్కింతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. సిక్కింలో ఏర్పాటు చేసిన సైనిక శిబిరాలు ఆకస్మిక వరదలకు కొట్టుకుపోయాయి. దీంతో ఆర్మీకి చెందిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీస్తా నదిలో బెంగాల్‌ దిశగా వెళ్తున్నాయి.

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని జలపాయీగుడీ జిల్లాలో ఇలా కొట్టుకొచ్చిన మోర్టార్‌ షెల్‌ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఇదే ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అందులోని ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  ఈ ప్రమాదం బెంగాల్ ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. నదుల్లో కొట్టుకువచ్చే అనుమానిత వస్తువులను ముట్టుకోవద్దని పోలీస్ అధికారులు సూచించారు. సైన్యం కూడా అప్రమత్తమై ఆయుధాలను గుర్తించేందుకు నదీతీరం వెంట స్పెషల్ టీమ్ ను రంగంలోకి దింపింది. ఇక సిక్కిం వరదల్లో ఇప్పటివరకు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు.

ఈ మృతుల్లో ఏడుగురు సైనికులు ఉన్నట్లు సమాచారం. గల్లంతైన 142 మంది కోసం  మూడు రోజుల నుంచి ఆర్మీ బృందం హెలికాప్టర్ తో గాలింపు కొనసాగింది. తక్షణ సహాయం కింద సిక్కింకు రూ.44.8 కోట్ల విడుదలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆమోదం తెలిపారు. వరద నష్టం అంచనాకు త్వరలో కేంద్ర బృందాన్ని సిక్కింకు పంపనున్నట్లు హోం శాఖ వెల్లడించారు. ప్రస్తుతం వరదల నీటిలో పేలుడు పదార్థాలు కొట్టుకు వస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ, ఏ పేలుడు సంభవిస్తోందనని భయం భయంగా ఉన్నారు. మరి.. సిక్కిం వరదల బీభత్సానికి కారణం ఏమిటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments