iDreamPost
iDreamPost
పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువును పోలీస్ నియామక సంస్థ పొడిగించింది. ఇవాళ రాత్రి 10 గంటలతో గడువు ముగియనున్న వేళ ఈ నెల 26వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ సానుకూల నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండేళ్ల వయో పరిమితిని పెంచుతూ సీఎం కేసీఆర్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల అభ్యర్ధనలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను, డీజీపీ మహేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు.
అందుకే దరఖాస్తు గడువును పొడిగించినట్లు తెలుస్తున్నది. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, రవాణా శాఖల్లో కలిపి 17,291 యూనిఫాం ఉద్యోగాల భర్తీకి ఈ నెల 2 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. అన్ని విభాగాలకు కలిపి, గురువారం నాటికి 5.2 లక్షల మంది అభ్యర్థుల నుంచి 9.33 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మహిళా అభ్యర్థుల దరఖాస్తులు 2.05 లక్షలు. దరఖాస్తు గడువు పొడిగించడంతో దరఖాస్తులు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నది అధికారుల అంచనా.