iDreamPost
android-app
ios-app

ప్రత్యర్థి మంత్రి అవడం ఆ సీనియర్‌ నేత జీర్ణించుకోలేకపోతున్నారా..?

ప్రత్యర్థి మంత్రి అవడం ఆ సీనియర్‌ నేత జీర్ణించుకోలేకపోతున్నారా..?

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అంశం టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడుకు ఏ మాత్రం రుచించనట్లుగా ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. మంత్రివర్గంపై యనమల చేసిన విమర్శలను చూస్తే.. ఆయన ఎంత కడుపు మంటతో రగిలిపోతున్నారో ఇట్టే అర్థమవుతుంది. జగన్‌ మంత్రివర్గం.. ఛాయ్, బిస్కెట్‌ కేబినెట్‌ అంటూ విమర్శలు చేశారు. యనమల ఈ తరహాలో వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం ఆయన రాజకీయ ప్రత్యర్థికి మంత్రివర్గంలో చోటు లభించడమేనని అర్థమవుతోంది. యనమల సోదరుల రాజకీయ ప్రత్యర్థి అయిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో చోటుదక్కింది. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా దాడిశెట్టి రాజా ప్రమాణస్వీకారం చేశారు.

ఈ పరిణామాన్ని యనమల జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. 1983 నుంచి 2004 ఎన్నికల వరకు తుని నుంచి యనమలే గెలిచారు. పలుమార్లు మంత్రిగా చేశారు. అయితే 2009లో యనమల విజయయాత్రకు బ్రేక్‌ పడింది. అప్పటికే పలుమార్లు పోటీచేసి ఓడిపోయిన ఎస్‌.ఆర్‌.వి.వి.కృష్ణంరాజు 2009లో యనమలపై విజయం సాధించారు. 2013లో ఎమ్మెల్సీ పదవిని పొందిన యనమల 2014లో తన తమ్ముడు యనమల కృష్ణుడు చేత పోటీ చేయించారు. వైసీపీ తరపున తొలిసారి దాటిశెట్టి రాజా పోటీ చేశారు. యువకుడైన దాడిశెట్టి రాజా చేతిలో యనమల కృష్ణుడు ఓడిపోయాడు. ఆ తర్వాత 2019లోనూ అదే పరిస్థితి ఎదురైంది. దాడిశెట్టి రాజా ఏకంగా 24,016 ఓట్ల భారీ మెజారిటీతో యనమల కృష్ణుడుపై గెలిచారు. ఇప్పుడు మంత్రి అయ్యారు.

యనమల కంచుకోటను దాడిశెట్టి రాజా బద్ధలుకొట్టారు. వరుసగా రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించారు.మొత్తంగా మూడు పర్యాయాలు యనమల సోదరులు తునిలో ఓడిపోయారు. యువకుడైన దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోవడం, ఇప్పుడు రాజా మంత్రి కూడా అవడంతో.. యనమల అసూయతో రగిలిపోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే జగన్‌ మంత్రివర్గాన్ని.. ఛాయ్, బిస్కెట్‌తో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపుపై అనుమానంతో ఉన్న యనమల.. 2019 ఎన్నికలకుముందు మరోసారి ఎమ్మెల్సీగా పదవి పొందారు. ఈ పదవీకాలం 2025 వరకు ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ యనమల పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లోనైనా గెలవాలనుకుంటున్న యనమల సోదరులకు.. రాజా మంత్రి కావడంతో వారి ఆశలు అడియాశలు అయినట్లుగా తెలుస్తోంది. అందుకే మంత్రివర్గంపై యనమల అనుచిత వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది.