iDreamPost
iDreamPost
సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీలో చీలిక వస్తుందని టీడీపీ ఆశలు పెట్టుకుంది. శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతం ఇస్తున్నాయి. మంత్రి మండలిలో మార్పు ద్వారా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించారని, జగన్ పదవీచ్యుతుడు కావడం ఖాయమని యనమల మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే ముందుగా చెప్పినట్టుగానే మంత్రివర్గంలో మార్పులకు జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలియనట్టు యనమల రాజకీయ సంక్షోభం అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తప్పుడు ప్రచారంతోనే రాజకీయం..
సంక్షేమ పాలనతో ప్రజాదరణ పొందుతున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని రాజకీయ నైరాశ్యంలో టీడీపీ ఉంది. అందుకే తప్పుడు ప్రచారంతోనైనా ప్రభుత్వాన్ని బదనాం చేద్దామని కొన్నాళ్లు ప్రయత్నం చేసింది. రాష్ట్రం డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందని, గంజాయి రవాణాకు అడ్డాగా తయారైందని విషప్రచారం చేసింది. శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్రం జోక్యం చేసుకోవాలని హడావిడి చేసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా విధ్వంసం అయింది. ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కూడా టీడీపీ కొన్నాళ్లు నానా హడావిడి చేసింది. అయితే వారి దుష్ప్రచారాన్ని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రజలు పట్టించుకోలేదు. అయినా తనదైన శైలిలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూనే ఉంది.
సంక్షోభం కాదు, రాజకీయ సంస్కరణ..
యాభై శాతం పైబడిన ఓట్లతో, 151 సీట్లతో అధికారం చేపట్టిన జగన్ ఎక్కువమందికి మంత్రులుగా అవకాశం ఇచ్చి ప్రజాతీర్పును గౌరవించాలని నిర్ణయించారు. అందుకే రెండున్నరేళ్ళకే మంత్రివర్గంలో మార్పులు చేస్తానని ముందుగానే ప్రకటించారని వైఎస్సార్ సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పరిపాలనా సంస్కరణలో భాగంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రులు అందరూ గౌరవిస్తూ క్రమశిక్షణతో పదవులకు రాజీనామాలు చేశారు. ప్రజాసేవకు పదవులు అక్కరలేదని తమ పార్టీ మంత్రులు నిరూపించారని అధికారపార్టీ నేతలు అంటున్నారు. అంతేకానీ యనమల చెబుతున్నట్టు ఎటువంటి రాజకీయ సంక్షోభం లేదు.
ముందు మీ సంగతి చూసుకోండి..
పదవులు కోల్పోయిన వారిలో కొందరైనా తమ మాటలకు ప్రభావితులవుతారని యనమల ఆశ పడుతున్నారు. 70 ఏళ్లు పైబడిన వయసులో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పదవీచ్యుతుడిని చేసిన ఘనత టీడీపీ నాయకులది. అటువంటి కుసంస్కారం తమ పార్టీలో ఎవరికీ లేదని వైఎస్సార్ సీపీ నాయకులు చెబుతున్నారు. మా పార్టీలో సంక్షోభంపై ఆశలు పెట్టుకోవడం కాదు. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకోవాలని యనమలకు అధికార పార్టీ నేతలు హితవు చెబుతున్నారు.