Idream media
Idream media
పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు పలు నిత్యావసరాల ధరల పెరుగుదల సామాన్యుల నడ్డి విరుస్తోంది. దీనికి ఏ ఒక్క రాష్ట్రమో కాదు.. దేశమంతా ఇదే పరిస్థితి. వాటి నుంచి కొంచెం ఉపశమనం కల్పించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటీవల చేపట్టిన చర్యల ఫలితంగా కొన్నింటి ధరలు అదుపులోకి వచ్చాయి. ప్రధానంగా నూనె ధరలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి ధరలను అదుపులోకి తెచ్చింది. అలాగే.. పేదల గృహ నిర్మాణాలకు సిమెంట్, స్టీలు తక్కువ ధరలకే సరఫరా చేసేలా నిర్ణయం తీసుకుంది. కానీ.. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఇవేమీ కనిపించడం లేదు. పైగా.. బాదుడే బాదుడు.. అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని అంశాలను కూడా ఆ జాబితాలోకి చేర్చి రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రో మంటలు, గ్యాస్ ధరలపై… ‘బాదుడే బాదుడు’ పేరుతో ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ సమావేశం నిర్ణయించింది. పెంచిన పన్నులు, పెరిగిన ధరలు చూస్తే ఒక్కో కుటుంబంపై లక్షల్లో భారం పడుతోందని, ఈ భారం విలువ ఎంతో కరపత్రాలు తయారు చేసి ఇంటింటికీ ప్రచారం చేయాలని సమావేశం నిశ్చయించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అప్పులను తీర్చేందుకు ప్రజలపై భారం మోపుతుందన్నట్లుగా మాట్లాడారు. అలాగే.. ప్రభుత్వ విధానాలతో ఏపీ తీవ్ర సంక్షోభం దిశగా ప్రయాణిస్తోందని ప్రధానితో కొందరు అధికారులు చెప్పారట. ఆ విషయం బాబు గారికి ఎవరు చెప్పారో ఆయనకే తెలియాలి.
టీడీపీ విడుదల చేసిన బాదుడు జాబితాలోని అన్ని అంశాలకూ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అనే అంశం పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు తెలియదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సుమారు పన్నెండు రోజులుగా దేశమంతా పెట్రోలు ధరలు వరుసగా పెరుగుతూ ఉన్నాయి. దాదాపు తొమ్మిది రూపాయలు పెరిగాయి. అలాగే.. గ్యాస్ ధరలను కూడా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ.. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్లుగా టీడీపీ ప్రచారం ఉంది. వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలపై పలు రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు కేంద్రం తీరుకు నిరసనగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. రాజ్యసభలోనూ బీజేపీయతర పార్టీలు భగ్గుమంటున్నాయి. తెలుగుదేశం కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టకపోగా.. కేవలం స్థానికంగా రాజకీయ లబ్ది పొందేలా మాత్రమే కార్యక్రమాలు రూపొందిస్తుండడం గమనార్హం.