iDreamPost
android-app
ios-app

పరిషత్ బహిష్కరణపై టీడీపీ సీనియర్ల అసంతృప్తి

  • Published Apr 02, 2021 | 1:50 PM Updated Updated Apr 02, 2021 | 1:50 PM
పరిషత్ బహిష్కరణపై టీడీపీ సీనియర్ల అసంతృప్తి

పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీలోనే అసంతృప్తి రేగుతోంది. దిగువ స్థాయి కార్యకర్తల పరిస్థితి ఎలా ఉన్నా..
సీనియర్లు, పొలిట్ బ్యూరో సభ్యులే తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉండే యనమల రామకృష్ణుడు నేరుగా పొలిట్ బ్యూరో సమావేశంలోనే ఎన్నికలు బహిష్కరించాలన్న ఆలోచనను వ్యతిరేకించారు. ఎన్నికల్లో పోటీ చేయడం నైతిక బాధ్యత అని ఆయన చెప్పగా..ఇందులో నైతికత ఏముందని చంద్రబాబు
కొట్టిపారేశారు.

కాగా మరో సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడైన అశోకగజపతి రాజు కూడా ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశంలో దీనిపైనే చర్చిస్తారని తెలియడంతో ఆయన ఏకంగా సమావేశానికి గైర్హాజరయ్యారు. పొలిట్ బ్యూరో సమావేశంలో కొందరు బహిష్కరణ వద్దని కోరినా చంద్రబాబు వినిపించుకోలేదు. తొలి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించలేదన్న సాకుతో ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.

అది కేవలం సాకే..

పరిషత్ ఎన్నికలను మళ్లీ తొలి నుంచి మొదలుపెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. గత ఏడాది మార్చిలో మొదలైన ఈ ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల ఘట్టం పూర్తి అయ్యాక.. అప్పటి ఎన్నికల కమిషనర్ కరోనా సాకుతో ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేశారు. బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని కూడా ..టీడీపీ ఫిర్యాదుల ఆధారంగా వ్యాఖ్యానించారు. ఏకగ్రీవాలను ప్రకటించవద్దని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. దీన్ని బ్యాతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన చోట ఆపడం కుదరదని ఏకగ్రీవాలను అధికారికంగా ప్రకటించాలని ఆదేశించింది.

Also Read : టీడీపీ అస్త్రసన్యాసం దేనికి సంకేతం..

అయితే టీడీపీ ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ చేసిన ఫిర్యాదునే ప్రస్తావిస్తోంది తప్ప హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడంలేదు. టీడీపీ డిమాండ్ చేస్తున్నట్లు తొలి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏకగ్రీవాలు కూడా రద్దవుతాయి. ఇవన్నీ టీడీపీ నేతలకు తెలియని విషయాలు కావు. కానీ వరుసగా పరాజయాలు ఎదురవుతున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ పోటీ చేసి మరో ఘోర పరాజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఇష్టం లేకే టీడీపీ నాయకత్వం బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, తొలి నుంచి ప్రక్రియ ప్రారంభించలేదన్న సాకులతో ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకుంది.

టీడీపీ శ్రేణుల ఆవేదన..

ఎన్నికలను బహిష్కరిస్తే ఇప్పటికే పార్టీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసి ఎంతో ఖర్చు చేసిన తమ పరిస్థితి ఏమిటని అనేకమంది అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఏడాది కాలంగా ఈ ఎన్నికల కోసమే ఎదురుచూస్తున్న తమకు పార్టీ నిర్ణయం కుంగదీసిందంటున్నారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం పై అసంతృప్తి ఉంటే.. ఎన్నికల్లో పోటీ చేస్తూనే వాటిని ఎదుర్కోవచ్చని.. రాజకీయ పార్టీగా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీ చేయడం ప్రజాస్వామ్య హక్కని అంటున్నారు. అటువంటి హక్కును చేజేతులా వదులుకోవడం పార్టీకి నష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్థాయిలో జరిగే పరిషత్ ఎన్నికలు పల్లెల్లో పట్టు పెంచుకోవడానికి, వర్గాన్ని, ఓట్ బ్యాంకును కాపాడుకోవడానికి ఉపయోగపడతాయని.. అందుకే పోటీ చేయడం అవసరమన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోటీ చేయకపోతే పార్టీ ఓట్ బ్యాంక్ చేదిరిపోవడంతో పాటు.. అన్ని స్థానాలను పువ్వుల్లో పెట్టి అధికార పార్టీకి అప్పజెప్పినట్లవుతుందని అంటున్నారు. ఇదే అభిప్రాయంతో ఉన్న సీనియర్ నేత అశోక్ పార్టీ నిర్ణయంలో భాగస్వామి కాలేక పొలిట్ బ్యూరో సమావేశానికి డుమ్మాకొట్టారు. పార్టీ నిర్ణయంపై దిగువస్థాయిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధిష్టానం నిర్ణయాన్ని కాదని పోటీలో కొనసాగాలని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల నాయకులు భావిస్తున్నారు. ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టుకొని చర్చిస్తున్నారు.

Also Read : చేతగాక కాదు.. కానీ పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం : చంద్రబాబు