iDreamPost
android-app
ios-app

ఏంది సామీ.. ఈ రచ్చ!

  • Published Oct 24, 2020 | 4:27 AM Updated Updated Oct 24, 2020 | 4:27 AM
ఏంది సామీ.. ఈ రచ్చ!

మూలిగేనక్కమీద తాటిపండు పడడం అంటే ఏంటో ఒక సారి ఊహించుకోండి.. ఆహా.. ఊహించుకోండీ..! ఎందుకు చెబుతున్నామంటే అసలే మూలుగుతూ ఉన్న నక్కమీద తాటిచెట్టు మీద నుంచి తాటిపండు పడిందనుకోండి దాని పరిస్థితి ఎలా ఉంటుందంటారు?.. ఇప్పుడు టీడీపీ పరిస్థితి అలాగే ఉందంటున్నారు పరిశీలకులు.

ఓ పక్క అధికార వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవడానికి అభిమాన్యుడు కాకపోయినా ఆ స్థాయిలో రాజకీయంగా యుద్దమే చేస్తున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు. అయితే మరో పక్క పార్టీని చక్కదిద్దేందుకు కూడా సమాయత్తమయ్యారు. తనకుతానుగా సరిదుద్దడు కార్యక్రమం చేసుంటే ఫలితం ఎలా ఉండేదోగానీ.. చినబాబుకు కూడా వేలుపెట్టే మహదావకాశాన్ని ఇవ్వడంతో ఇప్పుడు ఆ ఫార్ములా బెడిసికొట్టినట్టుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి పార్టీ ఓటమి తరువాత పెద్దగా నాయకులెవరూ పసుపు కండువాలతో జనజీవనంలో కనిపించిన దాఖలాల్లేవు. ఒకవేళ ఒకరిద్దరు కన్పించినప్పటికీ ఫోటోలు, వీడియోలు, ప్రెస్‌మీట్ల వరకు ఓకే గానీ ఆ తరువాత కండువాను పూర్తిగా మడిచి పక్కనెట్టేస్తూనే ఉన్నారు.

ఇదే క్రమంలో స్వయంగా చంద్రబాబు చెప్పినా గానీ కొన్ని ‘పిలుపు’లకు కనీస స్పందన కూడా సొంత పార్టీనుంచే కానరాలేదు. ఈ నేపథ్యంలో పార్టీకి కొత్త ఊపిరూలేదేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా పార్టీ పార్లమెంటరీ స్థాయి నాయకులకు ఇన్‌ఛార్జిలుగా ప్రకటించారు. ప్రకటించినంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడిప్పుడే లోలోపల రావణకాష్టం అంటుకుంటోందన్న సిగ్నల్స్‌ వెలువడుతున్నాయి. పార్టీకి ఎంతోకొంత పట్టున్న జిల్లాల్లో నేతలు ఇప్పుడిప్పుడే తమతమత అభిప్రాయాలను బాహాటంగానే వెలిబుచ్చుతున్నారు. కష్టకాలంలో పార్టీకి అండాదండాగా ఉన్నప్పటికీ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలో చంద్రబాబు, చినబాబు చిన్నచూపు చూసారంటూ నిన్నమొన్నటి వరకు దగ్గర వాళ్ళదగ్గరే వాపోయిన నాయకులు మెల్లిగా వీధికెక్కుతున్న దాఖలాలు విమర్శకుల దృష్టికి కూడా వస్తున్నాయి.

తమ అనుభవానికంటే తక్కువున్న వారికి పార్టీ పదవుల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న భావన అసంతృప్త నేతల నుంచి విన్పిస్తున్న వాదనగా ఉంది. ఇప్పటికే ఉన్న తలపోట్లకు తోడు ఇప్పుడీ తంటాలేంటంటూ పార్టీ కీలకనాయకులు తలలు పట్టుకుంటున్నారట. అయితే చినబాబు వేలు పెట్టిన కారణంగానే ఈ పరిస్థితి అంటూ దెప్పిపొడిచేవారు కూడా లేకపోలేదు. అయినప్పటికీ పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టు రాజకీయవర్గాల భోగట్టా.

రోజురోజుకీ తెలుగుదేశం పార్టీ విస్తృతి కుచించుకుపోతున్న నేపథ్యంలో పార్టీ భవిష్యత్తును కాపాడేందుకు నానా తంటాలు పడుతున్న చంద్రబాబు నాయుడు ఆయన బృందానికి ప్రస్తుత పరిస్థితి మింగుడుపడని విషయమేనంటున్నారు. అయితే పార్టీలో కీలకనాయకుల వాదన మరోలా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అసంతృప్త గొంతుకలు లేవనెత్తుతున్న వారంతా పార్టీలో ఉండడానికి ఇష్టం లేకే ఇటువంటి చర్యలకు దిగుతున్నారన్న అనుమానాలు కూడా లోలోన వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఇలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులంతా కీలకమైనవారే కావడంతో తమకు తాముగా బైటపడితే అదే వంకన ఈ నేతలంతా తమదారి తాము చూసుకుంటారన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మిన్నకుండిపోతున్నారంటున్నారు.

ఏది ఏమైనా చినబాబు మాటలతోనే గాదు, చేతలతో సైతం టీడీపీలో రచ్చరచ్చే క్రియేట్‌ చేస్తున్నారంటూ సెటైర్లు కూడా బలంగానే విన్పిస్తున్నాయి. వృద్ధ నేత చంద్రబాబు ఈ పరిస్థితిని ఏ విధంగా డీల్‌ చేస్తారో? కాలమే తేల్చాల్సి ఉంది.